స్నేహాలందు.. సినిమా వాళ్ల స్నేహాలు వేరయా అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. అది నటుల మధ్య అయినా కావొచ్చు… టెక్నీషియన్స్ మధ్య అయినా కావొచ్చు.
ఒక్కసారి ఫ్రెండ్షిప్ ఏర్పడితే అది ఒకరి సక్సెస్‌కు మరొకరు తమ శక్తికి మించి మరీ సాయం చేయడానికి సిద్ధపడతారు. అలాంటి మంచి రిలేషన్ ఒకప్పుడు మణిరత్నం,
రామ్‌గోపాల్ వర్మల మధ్య ఉండేది. ఉండేది అంటే ఇప్పుడు లేదని కాదు.. కానీ ఈమధ్య వీరిద్దరూ అంతగా కలిసి కనిపించిన సందర్భాలు అయితే లేవు.
ఇక విషయంలోకి వస్తే.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రాలలో ఓ అద్భుతం గాయం సినిమా. ఎస్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై అక్కినేని వారి పెద్ద అల్లుడు, ప్రముఖ నిర్మాత యార్లగడ్డ సురేంద్ర నిర్మాతగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందింది.
జగపతిబాబు, ఊర్మిళ, రేవతి తదితరులు నటించారు. రోజా సూపర్‌హిట్ తర్వాత మణిరత్నం చెన్నైలో జరిగిన ఓ గ్యాంగ్‌వార్ ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. ఓ సందర్భంలో వర్మతో ఈ లైన్ గురించి చెప్పారు మణిసార్.
వర్మకు బాగా నచ్చింది. పైగా క్రైమ్ కంటెంట్ అంటే వర్మక చెవి కోసుకుంటారు. వెంటనే ఈ కథను తనకు ఇవ్వమని, తాను మరో మంచి లైన్ మీకు ఇస్తానని మణిరత్నంతో చెప్పి ఈ కథను తీసుకున్నారు. అన్నట్టుగానే వర్మ తన దగ్గరున్న ఓ రాబరీ కథను ఆయనకు ఇచ్చారు.
వర్మ మణిరత్నం కథను చెన్నైకి బదులుగా విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్‌గా మార్చారు. 1993 ఏప్రిల్ 22న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. శ్రీ అందించిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ సంవత్సరానికి గాను 6 నందులు ఈ చిత్రం గెలుచుకుంది.
వర్మ నుంచి తీసుకున్న కథలో వర్మస్టైల్ రాబరీని రిజర్వ్‌బ్యాంకుతో ముడిపెట్టి దొంగ దొంగ (తమిళంలో తిరుడా.. తిరుడా) పేరుతో తీశారు మణిరత్నం. 1993 నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా కూడా సక్సెస్ అయింది.
ప్రశాంత్, హీరా, ఆనంద్, అను అగర్వాల్, బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రలు. ఏ.ఆర్. రెహ్మాన్ అద్భుతమైన సాంగ్స్ యావరేజ్‌గా ఉన్న సినిమాను హిట్ మెట్టు ఎక్కించాయి.
ఈ సినిమాలోని ‘‘వీరబొబ్బిలి కోటలో.. వెన్నెల కాసే వేళల్లో’’ పాట కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అప్పట్లో సంచలనం. ఇలా ఇచ్చి, పుచ్చుకుని ఇద్దరూ హిట్లు కొట్టారు.