
ఒకప్పుడు మెగా కుటుంబం అంటే ఒకటే. మెగా హీరోలు ఒకరికి ఒకరు అండగా ఉండేవారు. కానీ, కాలానుగుణంగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా, అల్లు అర్జున్ తన సొంత ఇమేజ్ కోసం మెగా ఛత్ర ఛాయ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆయన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల ప్రస్తావన తగ్గించేశారు. రామ్ చరణ్ గురించి అయితే అసలు మాట్లాడటం లేదు. తన అభిమానులను ప్రత్యేకంగా “ఆర్మీ” అని పిలుస్తూ, మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో, గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బన్నీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి ప్రచారం చేయడం మరింత చర్చనీయాంశమైంది. మెగా అభిమానులకు ఇది తీవ్ర అసంతృప్తిని కలిగించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక వైపు ఉంటే, బన్నీ వేరే పార్టీకి మద్దతు ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్, బన్నీ అభిమానుల మధ్య దూరం పెరిగింది. పుష్ప 2 రిలీజ్ సమయంలో కూడా మెగా ఫ్యాన్స్ తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అయితే, దీని ప్రతిఫలం గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో కనిపించింది. బన్నీ ఫ్యాన్స్ అప్పటికి రెడీగా ఉండి, ఆ సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు.
రాజమౌళి సినిమాతో మెగా ఫ్యాన్స్ ఇచ్చిన స్థాయిలో గేమ్ చేంజర్ అందుకోవలసిన స్థాయికి చేరలేదు. సినిమా ఫెయిల్యూర్‌తో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనికి తోడు, నిర్మాత దిల్ రాజు వ్యవహార శైలి కూడా చరణ్ అభిమానులకు నచ్చలేదు. ఆయన సినిమా కలెక్షన్ల గురించి, కాంబినేషన్ క్రేజ్ గురించి చేసిన వ్యాఖ్యలు చరణ్ ఫ్యాన్స్‌కు అసంతృప్తిని కలిగించాయి. అయితే, ఈ సంఘటనలతో ఇంకా ఆగ్రహం పెరిగినట్టైంది.
ఇటీవల ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చరణ్ అభిమానుల్లో మరింత అసహనం రేకెత్తించాయి. ఆయన మాట్లాడుతూ, సంక్రాంతికి ఒక సినిమాను కిందన పెట్టి, ఇంకో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారంటూ చేసిన వ్యాఖ్యలు చరణ్ ఫ్యాన్స్‌కు ఏకంగా ఆగ్రహాన్ని తెప్పించాయి. అరవింద్ క్యాజువల్‌గా మాట్లాడినా, నవ్వినా, గేమ్ చేంజర్ ఫెయిల్యూర్‌పై ఎగతాళి చేస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బన్నీకి లింక్ పెట్టి, మొత్తం అల్లు కుటుంబంపై మెగా అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల రన్, అభిమానుల స్పందన ఎలా ఉన్నా, మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సమతుల్యత కోల్పోయినట్టు అనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య గల విభేదాలు ఈ మధ్యకాలంలో మరింతగా బయటపడుతున్నాయి. మెగా హీరోలు మళ్లీ ఏకమవుతారా? లేక ఈ విభేదాలు మరింత పెరుగుతాయా? అనేది చూడాలి.