అనుకున్నది ఒక్కటే.. అయ్యింది కూడా ఒక్కటే అన్నట్టుంది తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ వ్యవహారం. దశాబ్దాల కాలంగా పాతబస్తీ కేంద్రంగా ముస్లిం ఓటర్లకు ఏకైక దిక్కుగా మారిన మజ్లిస్ పార్టీ మరోసారి అలవాటు ప్రకారం తన వైఖరిని మార్చుకున్నట్లు కనపడుతోంది.
దీని వెనకాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాతబస్తీకి సంబంధించినంత వరకూ ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. మజ్లిస్ దే తిరుగులేని హవా. 1993లో ఎంఐఎం బహిష్కృత నేత అమానుల్లాఖాన్ స్థాపించిన ఎంబీటీ (మజ్లిస్ బచావో తెహరీక్) దీనికి కొంత గండికొట్టినప్పటికీ, తర్వాత ఆపార్టీ హవా తగ్గిపోయింది.
కాలక్రమంలో ఎంఐఎంకు పోటీగా పాతబస్తీ కేంద్రంగా కొన్ని ముస్లిం పార్టీలు వచ్చినప్పటికీ ఏవీ ఓవైసీల ఆధిపత్యం ముందు నిలవలేక పోయాయి. తొలి నుంచి మజ్లిస్ కాంగ్రెస్‌కు దగ్గరగానే మసులుతూ వచ్చింది. విభజన అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్తో అనధికార దోస్తీని కొనసాగించింది.
అయితే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎంఐఎం కేసీఆర్‌కు జలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాతబస్తీలోని మూసీ పరివాహక ప్రాంతాన్ని ఏథెన్స్ నది మాదిరి డెవలప్ చేయాలనే ఆలోచనతో ఏథెన్స్ నదిని పరిశీలించారు.
ఈ పర్యటనలో అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఉండటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి తోడు నూతన అసెంబ్లీ సమావేశానికి ముందు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా కూడా నియమించారు రేవంత్‌రెడ్డి. ఈ పరిణామాలను గమనించిన వారికి ఓవైసీ బ్రదర్స్ మళ్లీ కాంగ్రెస్ పంచన చేరుతున్నారనే నిర్ధారణకు వస్తున్నారు.
దీనికి తోడు ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన మెజార్టీ దృష్ట్యా దూరదృష్టితో 7 స్థానాలు ఉన్న మజ్లిస్‌ను దగ్గరకు తీసుకుంటున్నారని కొందరు భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్`మజ్లిస్ అనధికార ఒప్పందాల్లో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మాకు మీరు.. మీకు మేము అన్న రాజకీయాలు నడిపాయి.
కాంగ్రెస్ గట్టిగా ఉన్న చోట్ల మైనార్టీ ఓట్లు దానికి పడకుండా మజ్లిస్ తమ అభ్యర్ధులను రంగంలోకి దింపింది. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విధంగా ఇబ్బందులు తలెత్తకుండా రేవంత్ పావులు కదుపుతున్నట్లు మనం భావించాలి.