గురివింద కూడా సిగ్గుపడుతుందేమో ధర్మానా?

0
402
darmana prasad rao

పాత రోజుల్లో రాజకీయాలు వేరు.. నీతి, నిజాయితీ, విలువలు, సిగ్గు, శరం అంటూ కొన్ని ఉండేవి. కానీ ఈ రోజుల్లో వాటన్నింటినీ పక్కన పడేసి, పాతరేస్తేనే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడు. దీన్ని బాగా వంట బట్టించుకున్న వారు పదవుల మీద పదవులు అనుభవిస్తూనే ఉంటారు.

గతంలో తాము ఒక విషయంలో ప్రవర్తించిన తీరును.. ఆ తర్వాత కాలంలో ఇతరుల విషయంలో తప్పు పడితే.. దాన్ని గురివింద గింజతో పోలుస్తారు. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు వింటుంటే గురివింద గింజ కూడా సిగ్గుపడుతుందేమో అనిపిస్తుంది.

విషయంలోకి వెళితే.. ఆదివారం షర్మిళ ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలిగా ఆమె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

darmana prasad rao

ఏపీలో జగన్‌రెడ్డి పాలనపై తీవ్రమైన విమర్శలే చేశారు. సహజంగా జగన్‌మోహన్‌రెడ్డిని గానీ, ఆయన పాలనను గానీ ఎవరైనా విమర్శిస్తే క్షణాల్లో ఆ పార్టీకి సంబంధించిన సకల శాఖామంత్రి అనబడే సజ్జల గానీ, లేదా మంత్రులు గానీ ఒంటికాలిపై లేస్తుంటారు.

అవతల వారిని ఛడామడా తిట్టిపోసి, అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. తాజాగా ఆ డ్యూటీని సీనియర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీసుకున్నారు. షర్మిళ ఏపీ కాంగ్రెస్‌కు ఎందుకు అధ్యక్షురాలు అయ్యింది అంటూ ప్రశ్నించారు. ఏం సాధించాలని ఆమె ఏపీకి వచ్చింది.

తెలంగాణలో పెట్టిన పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు కలిపింది. తన తండ్రి పేరును ఎఫ్‌.ఐ.ఆర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీలో షర్మిళ చేరడం వల్ల చనిపోయిన వైయస్సార్‌ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. షర్మిళ క్షమించరాని తప్పు చేసింది. అసలు ఏం సాధించాలని ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ధర్మాన.

అయితే ధర్మాన వ్యాఖ్యలు గురివింద గింజ నీతిని కూడా తలదన్నేలా ఉంది. నాడు కాంగ్రెస్‌ పార్టీ ఎఫ్‌.ఐ.ఆర్‌లో వైయస్సార్‌ పేరు పెట్టినప్పుడు సదరు ధర్మాన గారు ఆ పార్టీలోనే ఉన్నారు. అంతే కాదు నిండు సభలో వై.యస్‌. విజయమ్మను అవమానించిన చరిత్ర కూడా ధర్మానది.

తాను ఆనాడు కాంగ్రెస్‌లోనే ఉన్న విషయం మర్చిపోయి మాట్లాడటం చూస్తుంటే గురివింద గింజ కూడా సిగ్గుపడుతుందేమో మరి.