రాజకీయాల్లో ఎంతకాలం పరిపాలించాం అనేది కాదు.. ఎంతగా ప్రజల మనసుల్లోకి వెళ్లగలిగాం అనేదే ముఖ్యం. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన ప్రతి నాయకుడూ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించడటానికే ప్రయత్నిస్తుంటారు. అయితే అందులో కొందరికి మాత్రమే తాము ఆశించిన ఫలితం దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి శాశ్వత స్థానం పొందిన నాయకుల్లో నందమూరి తారకరామారావు, డా॥ వై.యస్. రాజశేఖరరెడ్డిని పేర్కొనాలి.
వీరిద్దరూ తమ నిర్ణయాల ద్వారా, అమలు చేసిన పథకాల ద్వారా చెరగని ముద్ర వేశారు. ఇలా అందరి గుండెల్లో గూడుకట్టుకున్న వారి నిర్ణయాలను, తెగువను ఆ తర్వాత వచ్చిన తరాల వారు ప్రదర్శిస్తే.. వారిని ఆ నాయకుల వారసులుగా పిలుచుకుంటారు. వై.యస్. రాజశేఖరరెడ్డి విషయాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, ఇందరిరమ్మ ఇళ్లు తర్వాత ఆయనకు అంతటి పేరు తెచ్చిపెట్టిన విషయం ‘ప్రజాదర్బార్’.
జగన్ సాధించిన అతి పెద్ద విజయాలు ఇవిగో!
ప్రతిరోజూ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఆయన స్వయంగా వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసేవారు. తద్వారా అనేక సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారానికి నోచుకునేవి. 2019 ఎన్నికల్లో జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ‘ప్రజాదర్బార్’ను నిర్వహిస్తారని ప్రకటించారు. అయితే అది అమలులోకి మాత్రం రాలేదు. ఇలా మూడుసార్లు ప్రకటించినప్పటికీ ఆయన ప్రజల్లోకి మాత్రం రాలేదు. ఇక ఏపీ ప్రజలు ‘ప్రజాదర్బార్’పై ఆశలు వదులుకున్నారు.
అయితే తాజాగా తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి తన పాలనతో ప్రజలకు చేరువకావాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని తిరిగి రాజశేఖరరెడ్డి నిర్వహించిన ప్రదేశంలోనే తిరిగి ప్రారంభించారు. ఇది చూసిన ప్రజలు రాజశేఖరరెడ్డి రక్తం పంచుకుపుట్టిన కొడుకు జగన్‌మోహన్‌రెడ్డికి చేతకానిది రేవంత్‌రెడ్డి చేసి చూపించాడు అంటూ మాట్లాడుకోవడం విశేషం.