ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాసేవ. ప్రస్తుతం అమ్ముడుబోవడాలు.. కొనుక్కోవడాలు ఇదే నయా ప్రజాస్వామ్యము నిజమైన అర్ధం. దీనికి వారని, వీరని, ఈ పార్టీ అని, ఆ పార్టీ అని తేడాలేం లేవు. ఎందుకంటే అన్నీ ఆ తాను (రాజకీయం రంగం) ముక్కలేగా. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 4 స్థానాలు మాత్రమే అధికంగా గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయినప్పటికీ ఏదో మూల భయం వెన్నాడుతూనే ఉంది. 2014, 1018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచిన అభ్యర్థులను తన పార్టీలోకి చేర్చుకోవడంలో చక్రం తిప్పిన కేసీఆర్ ఈసారి ఎటు నుంచి షాక్ ఇస్తారా అని భయపడుతోంది కాంగ్రెస్. దీనికి విరుగుడుగా కాంగ్రెస్ వైపు నుంచి ఆకర్ష్ వల విసరటానికి ఏర్పాటు చేసుకుంటోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎప్పుడు అనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
ఇదీ కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన గొప్ప గౌరవం
అయితే ఈలోగానే వెతకబోతున్న తీగలు కాలికి తగిలినట్లు ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే (భద్రాచలం) డాక్టర్ తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకరరావుతో కలిసి ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలవడం పెద్ద సంచలనం అయింది.
తాజాగా మేడ్చల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాజీమంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ ఆవరణలో ప్రముఖ జర్నలిస్ట్, కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్నతో మాట్లాడుతూ ఏదైనా అవసరం అయితే తాను కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడతానని చెప్పి బీఆర్ఎస్ నేతల్లో అలజడి రేపారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నారు. అంటే 1G1 ఆఫర్ అన్నమాట.
అలాగే ఎల్.బి. నగర్‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్ నాయకుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఇటీవల చిక్కడపల్లిలోని ఓ కాంగ్రెస్ ప్రముఖుని ఇంట్లో కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారట. అలాగే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే వెతక్కుండానే తీగలు కాంగ్రెస్ కాలికి తగులుకుంటున్నాయన్నమాట. ఇంకెన్ని తీగలు ఇలా కాంగ్రెస్ కాళ్లను పట్టుకుని.. సారీ చుట్టుకుని మొహమాట పెడతాయో.