గడచిన రెండు రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఆంధ్రజ్యోతి రేపిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక సంచలన కథనాలను అందించడంలో.. వండి, వార్చడంలో ఆంధ్రజ్యోతి అందెవేసిన చెయ్యి.
ముఖ్యంగా దివంగత వైయస్సార్ కుంటుంబలో ఏం జరుగుతుంతో మినిట్ టు మినిట్ రాధాకృష్ణకు తెలిసినట్టుగా జగన్‌కు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. వైయస్సార్ కుటుంబంలో విబేధాలు అంటూ ఆయన రాస్తే అందరూ దాన్ని ఫేక్ అనుకున్నారు.
ఆ తర్వాత షర్మిళ కొత్త పార్టీ పెట్టబోతోంది అని రాస్తే అందరూ ఇదీ అంతే అనుకున్నారు. రెండు జరిగాయి. తాజాగా షర్మిళ ఏపీ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించబోతున్నారు అని రాశారు.
ఇది కూడా నిజం అయ్యింది. అలాగే షర్మిళను ఏపీలోకి రావొద్దు అంటూ జగన్ తమ బాబాయ్ వై.వి. సుబ్బారెడ్డిని రాయబారం పంపినట్లు ఫస్ట్ పేజీలో రాసి సంచలనం సృష్టించాడు రాధాకృష్ణ.
గత రెండు రోజులుగా మీడియాలో చర్చోపచర్చలకు కారణమైన ఈ ఇష్యూపై ఎట్టకేలకు జగన్ బాబాయ్ వై.వి. సుబ్బారెడ్డి స్పందించారు. ‘‘నేను వైయస్సార్ కుటుంబ సభ్యుణ్ణి.
మాకు ఫ్యామిలీ రిలేషన్ ఉంది. వదినమ్మ విజయమ్మగారిని కలవటానికి వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ రాజకీయమైన చర్చలు ఏవీ రాలేదు. షర్మిళ ఏపీ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నాకైతే సమాచారం లేదు.
పత్రికల్లో ఏవేవో రాస్తున్నారు కదా అని స్పందించమంటే ఎలా?. జగన్ గారు ప్రజలను నమ్ముకున్నారు. ఆయన అదే బలం అని భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా ఉండవచ్చు.
స్వంత కుటుంబ సభ్యులు వివిధ పార్టీల్లో ఉన్న ఫ్యామిలీలు ఎన్ని లేవు. షర్మిళ కాంగ్రెస్‌లో చేరే విషయం అధికారికంగా నాకు తెలిసినప్పుడు స్పందిస్తాను.
ప్రస్తుతం మా దృష్టి అంతా ఏపీలో మళ్లీ జగన్ పాలనను ఎలా తీసుకురావాలి అన్న దానిమీదే కేంద్రీకరించాము. మాకు అదే ప్రధానం. టిక్కెట్లు ఇవ్వలేని వారిని పిలిచి మాట్లాడుతున్నాము. వారికి సర్ధి చెపుతున్నాము.
అందరూ సంతోషంగా ఇందుకు అంగీకరిస్తున్నారు. మళ్లీ వైసీపీని అధికారంలోకి తేవటానికి తమ సీట్లను త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు.