గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అనేక ఉచిత పథకాలు హామీ ఇచ్చేవారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉచిత పథకాల హామీలు నెరవేర్చింది తక్కువనే చెప్పవచ్చు.
దీనితో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకి ‘ఆల్ ఫ్రీ బాబు’ అనే పేరు పెట్టారు. అప్పట్లో ఈ పేరు వైఎస్ అభిమానులు బాగా ఉచ్చరించేవారు. ఆ తరువాత ఈ పేరు క్రమేపి మరుగున పడింది. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు కూడా అనేక పథకాలు హామీల వర్షం కురించారు.
అయితే అధికారంలోకి వచ్చిన ఆ హామీలు అన్ని మరుగున పడ్డాయని చెప్పవచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో 2019 లో అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల కోసం కొత్త హామీలు ఇవ్వడం మొదలు పెట్టారు చంద్రబాబు.
విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం రాత్రి జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో బాబు మాట్లాడారు. ఈ సారి టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే ఆల్ ఫ్రీ అని చెప్పకనే చెప్పారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడంలో మహిళలకి ఉచిత బస్సు పథకం ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఇప్పడు ఇదే పథకాన్ని టిడిపి అధికారంలోకి వస్తే ప్రవేశపెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే కాకుండా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి రూ.1500 నేరుగా ఖాతాల్లోకి వేస్తామని హామీ ఇవ్వడం విశేషం.
అంతటితో ఆగకుండా తల్లికి వందనం పేరుతో ప్రతి ఏడాది మహిళల అకౌంట్ లలో 15 వేల రూపాయలు వేస్తామని చెప్పారు. ఇంకా రైతులకి ఏడాదికి 20 వేల రూపాయలు ఇస్తామని, ఏడాదికి మూడు సిలిండర్ లు ఉచితంగా ఇస్తామని తెలిపారు.
ఇంకా అంతటితో ఆగకుండా నిరుద్యోగులకు నెలకి 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంకా ఇవన్నీ ఇప్పటికి మాత్రమే అని.. అసలు హామీలు పూర్తి మ్యానిఫేస్టో త్వరలో విడుదల చేస్తామని చెప్పడం విశేషం.
ఇలా నోటికొచ్చిన హామీలు ఇస్తుండడం చంద్రబాబుకి అలవాటే అని ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబుకి పెట్టిన ‘ఆల్ ఫ్రీ బాబు’ అనే పేరు సార్ధకం చేసుకున్నాడని వైసిపి నేతలు చెబుతున్నారు.