సంక్రాంతి అంటేనే కోడి పందాలు.. కోడిపందాలు అంటేనే సంక్రాంతి అన్నట్టుగా ఉంటుంది ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో. అనాదిగా వస్తున్న కోడిపందాల నిర్వహణ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది.
ప్రారంభంలో సరదగా ప్రారంభమైన ఈ పందాలు రాను రాను ప్రాంతీయ ప్రతిష్ఠకు నాంది పలికాయి. దీంతో అనేక గ్రామాలు, ప్రాంతాలు ఈ పందాల నిర్వహణను, గెలుపును ప్రతిష్ఠగా తీసుకుని ఎకరాలకు ఎకరాల పొలాలు,
లక్షల రూపాయల డబ్బు పందాలపై పెట్టడం మొదలు పెట్టారు. ఒకప్పుడు పొలాల మధ్య గానీ, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత పందాల కోసమే కోళ్లను మేపడం, బరులను నిర్వహించడం మొదలైంది.
ఇలా క్రమ క్రమంగా అప్‌డేట్ అవుతూ కోళ్ల పందాల కోసం లేటెస్ట్ బరులను ఏర్పాటు చేయడం, వాటిలో పందెం రాయుళ్ల కోసం సకల సౌకర్యాలను కల్పించడం మొదలెట్టారు.
కొన్ని చోట్ల టవర్ ఏసీలను కూడా పెట్టడం విశేషం. ఇలా కొత్త పుంతలు తొక్కుతున్న కోడిపందాల్లో ఈసారి బౌన్సర్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కోడిపందాల నిర్వహణ ఒక్కోసారి అత్యంత వివాదాస్పదంగా మారుతుంటుంది. ఈ సందర్భంగా అనేక ఘర్షణలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పోలీసులు వీటి నిర్వహణకు అనుమతి ఇవ్వరు.
అయినప్పటికీ నిర్వాహకులు పోలీసులకు గొడవలు జరిగితే మాదే బాధ్యత అని చెప్పి అనధికారికంగా పర్మిషన్‌లు తెచ్చుకుంటూ ఉంటారు.
ఈసారి బరుల్లో గొడవలు జరగకుండా ఉండేందుకు శిక్షణ పొందిన బౌన్సర్లను రంగంలోకి దింపుతున్నారు. ఏపీలోని విశాఖ, రాజమండ్రి, విజయవాడు, గుంటూరు, భీమవరం,
తణుకు ప్రాంతాల్లోని ప్రముఖ జిమ్ నిర్వాహకులు ఈ బౌన్సర్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా శిక్షణ తీసుకున్న బౌన్సర్‌లు కోడిపందాలు జరిగే బరులను తమ ఆధీనంలోకి తీసుకుని రక్షణ చర్యలు చేపడతారు.
భీమవరం, ఆచంట, రాజమండ్రి, గన్నవరం, పల్నాడు వంటి ప్రాంతాలకు సెలబ్రిటీలు కూడా వస్తారు. కాబట్టి వారి రక్షణ కోసం కూడా వీరిని వినయోగించనున్నారు.
మొత్తం మీద దాదాపుగా 500 మంది బౌన్సర్‌లను ఈ కోడి పందాల నిర్వహణకు నియమించుకున్నారట. చూశారా పందెం కోళ్లు ఎలా అప్‌డేట్ అవుతున్నాయో.. తమ రక్షణకు బరిలోకి బౌన్సర్‌లను కూడా దింపుతున్నాయన్నమాట.