ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందే తడవుగా నిర్మాతల టెన్షన్ మామూలుగా ఉండదు. ముందు మంచి కథ దొరకాలి, దానికి తగ్గ దర్శకుడు దొరకాలి, కథకు తగిన హీరో, హీరోయిన్లు, ఇతర ఆర్టిస్ట్‌లు దొరకాలి.
ఇన్ని దొరికిన తర్వాత మొదలెట్టిన సినిమా సమయానికి పూర్తి కావాలి. అలా పూర్తయితే సరిపోదు. అది విజయవంతం అయిన సినిమా అనిపించుకోవాలి.
అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. విజయవంతమైన సినిమా అంటే ఏమిటి?. దీనికి సరైన అర్ధం ఎవరి వెర్షన్లో వారు చెపుతుంటారు.
సినిమా వ్యాపారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో కేవలం థియేటర్ నుంచి వచ్చే కలెక్షన్లే ఆ సినిమా రేంజ్‌ను చెప్పేవి. ఆ తర్వాత థియేట్రికల్ రైట్స్‌కు అనుబంధంగా ఆడియో రైట్స్ వచ్చాయి.
ఆ తర్వాత వీడియో క్యాసెట్స్ అంటూ కొత్త ఆదాయ మార్గం దొరికింది. ఆ తర్వాత టీవీ డిజిటల్ రైట్స్ తెరమీదకు వచ్చాయి. ఇటీవల కాలంలో యూట్యూబ్ అని, ఓటీటీ అని, శాటిలైల్ అని రకరకాల మార్గాలు నిర్మాతకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ రైట్స్‌ను అమ్ముకోవడం ద్వారా నిర్మాత సినిమా విడుదలకు ముందే కొంత సేఫ్ జోన్లోకి వచేస్చస్తున్నారు. ఆ తర్వాత థియేటర్ రిలీజ్ హక్కుల విక్రయం ద్వారా మిగిలినది కవర్ చేసుకుంటూ లాభాలా ఆర్జిస్తున్నారు.
అయితే కేవలం నిర్మాత తాను పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకుంటే అది విజయవంతమైన సినిమానా అంటే.. కాదు అంటున్నారు సూపర్‌హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న యువ నిర్మాత నాగవంశీ.
ఇటీవల ఓ ప్రెస్మీట్లో ఏ సినిమాను హిట్ సినిమాగా చెప్పవచ్చు అనే అంశంపై మాట్లాడుతూ…
నా దృష్టిలో నిర్మాతను సేఫ్‌గా ఉంచిన సినిమా హిట్ సినిమా కానేకాదు. ఎందుకంటే నిర్మాతకు రకరకాల రైట్స్ అమ్మకం ద్వారా డబ్బులు వస్తాయి.
వాటిలో థియేట్రికల్ రైట్స్ అనేది కూడా ఒక భాగం. కానీ ఆ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలు వస్తేనే అది హిట్ సినిమా అవుతుంది.
ఎందుకంటే వారికి థియేటర్స్ నుంచి వచ్చే కలెక్షన్స్ మాత్రమే ఆదాయం. మిగిలిన ఏ విధమైన ఆదాయం ఉండదు. కాబట్టి నిర్మాతను సేఫ్‌గా ఉంచిన సినిమాలను హిట్ సినిమాలు అని చెప్పలేం అన్నారు.