ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ ఓ మాదిరి ఆడడంతో మెగాస్టార్ చిరంజీవి ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’పైనే ఉన్నాయి. జనవరి 13 (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహరాజ్ రవితేజ చిరంజీవితో స్ర్కీన్ ను పంచుకున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించారు.
ఇద్దరు హీరోలు అందులో ఒకరు మాస్ కే మహరాజ్ అయితే మరొకరు రికార్డులకే బాస్. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై ఆది నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రోమోలు, టీజర్లు, పోస్టర్లతో అవి కాస్త ఎక్కువయ్యాయి. ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
స్టోరీ
విశాఖపట్నంలోని వాల్తేరుకు చెందిన జాలరిపేటలో నివసించే వీరయ్య (చిరంజీవి) అక్కడ పెద్దగా ఉంటాడు. తనకు నా అన్న వాళ్లు ఎవరూ లేకపోవడంతో పేటలోని వారిని తనవాళ్లే అనుకుంటాడు వీరయ్య. సీతాపతి (రాజేంద్రప్రసాద్) వీరయ్యను కలుసుకొని డ్రగ్స్ డాన్ (బాబీ సింహ) అంతు చూడాలని ఆయన చేతిలో ఎంతో మంది బలయ్యారని అందుకు ఎంత డబ్బయినా ఇస్తానని చెప్తాడు. డ్రగ్స్ డాన్ మాలేషియాలో ఉండడంతో వాల్తేరు వీరయ్యతో పాటు అతని అనుచరులను వెళ్తారు.
అక్కడికి వెళ్లిన వీరయ్యకు అక్కడి హోటల్ లో పని చేసే అధితి (శృతి హాసన్) పరిచయం అవుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ డాన్ ను పట్టుకోవడం తన టార్గెట్ కాదని, అతని అన్న మైఖేల్ (ప్రకాశ్ రాజ్) తన టార్గెట్ అంటూ సీతాపతికే షాక్ ఇస్తాడు వీరయ్య. అసలు ఆంధ్రప్రదేశ్ లో చేపలు పట్టుకునే వీరయ్యకు డ్రగ్స్ మాఫియా కింగ్ అయిన మైఖేల్ కు లింక్ ఏంటి..? వీరయ్య గతం, శృతి హాసన్ ఎవరు..? వీరయ్య అనాథనా లేక అనాథగా మారాడా..? ఇలాంటి సందేహాలు తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కథ కొత్తదేం కాదు. గతంలో ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. ఓల్డ్ స్టోరీతోనే మరో న్యూ మూవీ తీశాడు బాబీ. సినిమా బిగినింగ్ నుంచి చిరంజీవి ఎంటర్‌టైన్ చేస్తూ కనిపిస్తాడు. ఇక ఇంటర్వెల్ వచ్చే సరికి షాక్ ఇస్తాడు. సెకండ్ ఆఫ్ లో బాబీ తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. రవితేజ ఎంట్రీతో కథ కొత్త మలుపులు తిరుగుతూ ఊపందుకుంటుంది.
దీనికి తోడు శృతి హాసన్ రా ఆఫీసర్ అని తెలుస్తుంది. ఆమె చేసే ఫైట్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇందులోకి మరో క్యారెక్టర్ వస్తుంది. దాని చుట్టూనే కథ అల్లారు బాబీ. ఫస్ట్ ఆఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ జోడించినా, సెకెండ్ ఆఫ్ మాత్రం సాగదీతతో సాగుతుంది. కథ పాతదే అయినా చిత్రీకరణ బాగుంది. కామెడీ, ఎమోషన్స్, డాన్స్ అన్నీ సమపాళ్లలో మేలవించారు బాబీ. వీటితో గట్టెక్కుతుందనే చెప్పాలి.
తారాగణం
నటీనటుల గురించి చెప్పుకుంటే మెయిన్ హీరో చిరంజీవి పాత్ర పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ మోడ్ లో సాగింది. రవితేజ తెలంగాణ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు. శృతి హాసన్ రా ఆఫీసర్ గా చేసిన ఫైట్లు, నటన ఆకట్టుకుంది. మెగాస్టార్, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. బాబీ సింహా, ప్రకాశ్ రావు, షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ప్రదీప్ రావత్, వెన్నెల కిశోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఊర్వశి రౌతేలా చేసిన డాన్స్ ఆద్యంతం ఆకట్టకుంది.
టెక్నికల్
డైరెక్టర్ బాబీ తనదైన మార్క్ ను చూపించారు. చిరంజీవిని స్క్రీన్ ప్రజెంట్ చేయడంలో విజయం సాధించారనే చెప్పాలి. మెగా అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకున్నారో అదేవిధంగా చూపించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిందనే చెప్పాలి. బాస్ సాంగ్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ వేసిన హార్బర్ సెట్ తో పాటు మరిన్ని ఆకట్టుకున్నాయి. కోణ వెంకట్ డైలాగ్స్ వర్కవుట్ అయ్యాయి. నవీన్ శంకర్ ప్రొడక్షన్ లో ఎక్కడా రాజీ పడకుండా తీశారు.
ఒక్క మాటలో: ‘వాల్తేరు వీరయ్య’ మర్షియల్ మాస్ ఎంటర్ టైనర్.. ఫ్యాన్స్ కు మాత్రం పూనకాలు లోడింగే..
రేటింగ్: 2.75/5