సెంటిమెంట్… వ్యక్తుల జీవితాల్లోనే కాదు.. కొన్ని రంగాల్లో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ సినిమా రంగంలో అయితే మరీను. సెంటిమెంట్ల కోసం తమ సినిమాలను, కెరీర్లను పణంగా పెట్టే బ్యాచ్ ఇక్కడ ఎక్కువ. తాజాగా ఓ సెంటిమెంట్ కోసం కోట్లు నష్టపోవటానికి కూడా సిద్ధ పడ్డాడు ఓ దర్శకుడు. అందులోనూ అమ్మాలేదు.. నాన్నాలేడు.. అక్కాలేదు.. చెల్లీ లేదు ఏక్ నిరంజన్ అంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ అంటే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది అక్షరాలా నిజం.
2022 ఆగస్టు 25న విడుదల
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ`అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. ప్రపంచ బాక్సింగ్ ఐకాన్ మైక్ టైసన్ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈసినిమాను 2022 ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు పూరి. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
చివరిలో నత్త నడకన
ఈ డేట్ వెనకాల ఉన్న సెంటిమెంట్ కారణంగానే.. టాలీవుడ్లో మోస్ట్ ఫాస్టెస్ట్ మూవీ మేకర్‌గా పేరున్న పూరి జగన్నాథ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమాను చివరిలో నత్త నడకన చేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2017 ఆగస్టు 25న విడుదలైన ‘అర్జున్‌రెడ్డి’ విజయ్ దేవరకొండను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. అందులో శాలినీ పాండే హీరోయిన్. ఈ చిత్రాన్ని కూడా ఆగస్టు 25నే విడుదల చేయాలని పూరి ఫిక్స్ అయ్యారట.
పూరీ లెక్క చేయడం లేదని యూనిట్ సభ్యులు గుసగుస
అందులోనూ ‘అర్జున్‌రెడ్డి’లో నటించిన హీరోయిన్, ‘లైగర్’ హీరోయిన్ ఇద్దరూ ‘పాండే’లు కావడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే రిలీజ్ డేట్ సెంటిమెంట్ కోసమే సినిమాను వాయిదా వేయడం వల్ల దాదాపు 5 కోట్ల రూపాయల వరకూ నష్టం వస్తోందని, అయినా పూరీ లెక్క చేయడం లేదని యూనిట్ సభ్యులు గుసగుసలాడుతున్నారు. చూడాలి పూరి సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో.