విజయవాడ టీడీపీలో రచ్చ రచ్చ

0
856

విజయవాడ పశ్చిమ నియోకవర్గ ఇన్‌చార్జ్‌గా స్థానిక ఎంపి కేశినేని నానిని నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో విజయవాడ తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. ఓ వైపు బుద్ధా వర్గం, మరోవైపు నాగుల్‌మీరా వర్గాలు మండి పడుతున్నాయి. వారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నాని నియామకం ప్రకంటించిన వెంటనే కొందరు బుద్ధా వెంకన్న ఇంటికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి కాకుండా కార్యకర్తలను పట్టించుకోని నానికి పదవి ఇవ్వడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ నాని బ్లాక్‌మెయిల్‌ రాజకీయం

ఈ సందర్భంగా కేశినేని నాని డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా కృషి చేశారని, కేశినేని నాని ఒంటెద్దు పోకడల వల్లనే మొన్న జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ మేయర్‌ పీఠం కైవసం చేసుకోలేక పోయిందని ఆరోపించారు. చంద్రబాబు నివాసంపై దాడి చేసినా.. మంత్రులు నోటికొచ్చినట్లు తమ అధినేతపై బూతులు ప్రయోగించినా కేశినేని ఏనాడూ స్పందించలేదని వెస్ట్‌ నేతలు అన్నారు. మైనార్టీలను, బీసీలను కాకుండా ఓసీలకు చెందిన నానిని నియమించడం వెనుక ఎంపీ నాని బ్లాక్‌మెయిల్‌ రాజకీయం ఉందని వారు అన్నారు.

ఈ వర్గాల్లో నానికి మంచి పట్టు

మరోవైపు కేశినేని వర్గీయులు ఎంపీ కార్యాలయం అయిన కేశినేని భవన్‌ వద్ద బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. నాని కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు అని, అయన్ను నియమించడం పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగ పడుతుందని నాని వర్గం పేర్కొంటోంది. వెస్ట్‌ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు భారీగానే ఉంది. ఈ వర్గాల్లో నానికి మంచి పట్టు ఉంది.

అధిష్టానం ఏ విధంగా కంట్రోల్‌లోకి తెస్తుందో

ఈ కారణంగానే అధిష్టానం నాని వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పైగా నాని ఆర్థికంగా బలవంతుడు కూడా కావడం ఆయనకు కలిసొచ్చిన అంశం. నాని నియామకంతో మొదలైన ఈ రచ్చను టీడీపీ అధిష్టానం ఏ విధంగా కంట్రోల్‌లోకి తెస్తుందో చూడాలి.