మీరు మా దారిలోకి వచ్చే వరకూ ఈ కథ ఇంతే

0
1105

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం.. టామ్‌ అండ్‌ జెర్రీ ఆటను తలపిస్తోంది. పీఆర్సీ, ఐఆర్‌, పెండిరగ్‌ నిధుల కోసం ఉద్యోగులు గత కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్‌లు అన్నీ ఆర్థికపరమైనవి కావడం, ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండటంతో వీటిపై నాన్చుడు ధోరణికే ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే చర్చల పేరుతో వారి సహనాన్ని పరిక్షిస్తోంది.

ఉద్యోగ సంఘాలతో తూతూ మంత్రం చర్చలు

ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం కూడా తాము సూచించిన పరిష్కారానికి ఉద్యోగులను ఒప్పించటానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అనేక చర్చోపచర్చలు జరిపిన ప్రభుత్వం బుధవారం కూడా ఉద్యోగ సంఘాలతో తూతూ మంత్రం చర్చలు సాగించింది. పీఆర్సీపై అధికారులు ఇచ్చిన నివేదిక అన్యాయమని, అసలు ముఖ్యమంత్రిగారు ఏం చెప్పారో.. ప్రభుత్వం అభిప్రాయం ఇప్పటికీ తమకు చెప్పటం లేదన్నారు.

పొంతన లేని మాటలు

తమకు సంబంధించిన వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద 2,200 కోట్లకుపైగా నగదు ఉందని ఉద్యోగ వర్గాలు చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం అది 1600 కోట్లు మాత్రమే అని చెప్పటం అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి సలహాదారు సజ్జలతో సమావేశం అని.. మరోసారి ఆర్థికమంత్రి బుగ్గనతో భేటీ అని, ఇంకోసారి సీస్‌ నేతృత్వంలోని కమిటీతో చర్చలు అంటారు.. అంతేగాని ముఖ్యమంత్రితో మాత్రం సమావేశం ఏర్పాటు చేయరు.

ఉద్యోగ సంఘాల్లో చీలిక

ఇలా కాలయాపన చేస్తూనే ఉద్యోగ సంఘాల్లో చీలిక తీసుకురావటంపై ప్రభుత్వం కసరత్తు చేయటానికి ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా లేక పోలేదు. మొత్తానికి ఉద్యోగుల డిమాండ్‌ల విషయంలో ‘‘మీరు మా దారిలోకి వచ్చే వరకూ ఈ కథ ఇంతే’’ అన్నట్టుగా తాత్సారం చేస్తోంది ప్రభుత్వం.