తాగుబోతులను పక్కన పెడితే.. ప్రభుత్వానికి షాక్‌ గట్టిగానే కొట్టింది

0
707

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అనే నానుడి ఏపీ ప్రభుత్వానికి అతికినట్టు సరిపోతుంది. తాము తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగబద్ధమైనవా కాదా అని సరి చూసుకోకుండా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం.. ఆ తర్వాత కోర్టుతో మొట్టికాయలు తినటం అలావాటుగా మారింది. వాస్తవాలు, భవిష్యత్‌ పరిణామాలు ఊహించకుండా మాట ఇవ్వడం.. ఆ తర్వాత మడమ తిప్పటం.. ప్రజల్లో చులకన అవ్వటం షరా మామూలుగా మారింది.

సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రచారం

తాజాగా మద్యం ధరలు తగ్గింపు విషయంలో కూడా ప్రభుత్వం నెగెటివ్‌ మార్కులు తెచ్చుకుంది. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రచారం చేసి, మేనిఫెస్టోలో పెట్టిన జగన్‌ సర్కార్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత తామే మద్యం అమ్మకాలను చేపట్టింది. అంతేకాక చాలాకాలంగా మార్కెట్‌లో ఉన్న బ్రాండ్‌లను పక్కనపెట్టి, ముక్కు, మొహం తెలీని బ్రాండ్‌లను తీసుకురావటం, రేట్లను అమాంతం పెంచేయడం చేసింది. రేట్లు పెంచడం వల్ల తాగుడు మానేస్తారు అనే అర్ధం, పర్ధం లేని లాజిక్‌ను తెరమీదకు తెచ్చింది.

సర్కార్‌కే ఎదురు షాక్‌

అయితే ఈ నిర్ణయం వల్ల సరిహద్దు రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ మద్యం స్మగ్లింగ్‌ పెరిగిపోతుందని, అలాగే నాటు సారా తయారీ విచ్చలవిడిగా మారుతుందని మీడియాతోపాటు అధికారులు సైతం మొత్తుకున్నా ప్రభుత్వం వినలేదు. దీని పర్యవసానం ప్రభుత్వానికి బాగా తెలిసొచ్చింది. దీనికి తోడు స్వంతపార్టీ ఎంపీ మద్యం ధరలు, బ్రాండ్‌ల విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయడతో తాజాగా మద్యం రేట్లను తగ్గిస్తూ.. ఇతర బ్రాండ్‌లను ప్రవేశ పెడుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను పెంచి తాగుబోతులకు షాక్‌ ఇద్దామనుకున్న సర్కార్‌కే ఎదురు షాక్‌ తగిలినట్లు అయిందని కామెంట్లు చేస్తున్నారు జనం.