షర్మిళకు ఇచ్చేంత సలహాలు నా దగ్గరేమీ లేవు

0
635
undavalli arun kumar

ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. మాజీ ఎంపీగా, నిబద్ధతగల కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా, హుందాతో వ్యవహరించే రాజకీయ నాయకుడిగా మంచి పేరు ఉన్న వ్యక్తి. 2004, 2009 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అడపా దడపా రాష్ట్రంలోని పలు సమస్యల మీద, పోలవరం ప్రాజెక్ట్‌ మీద తనకున్న అవగాహన మేరకు ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు వాస్తవాలు వివరిస్తుంటారు.

తాజాగా గురువారం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ ఆయన్ను కలుసుకున్నారు. రాజమండ్రిలోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిళ ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ భేటీలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌. రఘువీరారెడ్డి, పళ్లంరాజు, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.

undavalli arun kumar

అనంతరం ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ… షర్మిళగారు మా ఇంటికి రావటం నేనూ ఊహించలేదు. కాకినాడలో జరిగిన మీటింగ్‌కు హాజరై తిరుగు ప్రయాణంలో రాజమండ్రి మీదుగా వెళుతూ మా ఇంటికి వచ్చారు.

ఆమెతో ఉభయ కుశలోపరులు తప్ప పెద్దగా రాజకీయ విషయాలు ఏమీ చర్చకు రాలేదు. ఆమె మంచి పరిణితి చెందిన నాయకురాలిలాగా ఈ మధ్య ఇస్తున్న స్పీచ్‌లను బట్టి తెలుస్తోంది. రాజశేఖరరెడ్డికి నేను బాగా క్లోజ్‌ అయినప్పటికీ షర్మిళతో ఎక్కువసేపు మాట్లాడిరది మాత్రం ఈరోజే.

ఆమెకు ఇచ్చేంత సలహాలు నాదగ్గరేమీ లేవు. నేను కాంగ్రెస్‌ పార్టీ వాడిని కాబట్టి.. ఆమె మా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు కాబట్టి నన్ను కలవడం పెద్ద వింత, రాజకీయంగా సంచలనం అని నేను అనుకోను.

ఈ దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే సిస్టమెటిక్‌గా, రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌తో, కమిట్‌మెంట్‌తో అనేక పనులు చేసింది. ఇది ముమ్మాటికీ వాస్తవం. షర్మిళను వైఎస్సార్‌సీపీ వాళ్లు విమర్శించడం రాజకీయాల్లో సహజం. అది పెద్ద విషయం కాదు.

రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీల్లో ఉండటం సహజం. నా దీవెనల కోసం వచ్చాను అన్నారు. తప్పకుండా నా దీవెనలు ఉంటాయి అన్నాను అన్నారు.