రాజకీయ పార్టీల మధ్య వైరం ఒక్కోసారి భలే వింతా అనిపిస్తుంది. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు, జోకులు, ప్రతీకార వ్యాఖ్యలు శాసనసభ సమావేశాలను వీక్షించే వారికి మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిగిస్తాయి.
సహజంగా అధికారపక్షానికి అసెంబ్లీలో కొంత పైచేయి ఉంటుంది ఈ కారణంగానే ప్రతిపక్షాలపై ఒంటికాలు మీద లేస్తూ ఉంటారు. అంతేనా గతంలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల్లో జరిగిన తప్పులను లేవనెత్తుతూ వారిని మాట్లాడకుండా చేయటానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. ఒకవేళ ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో తిరబడి మాటల దాడికి దిగితే ఇక వెంటనే గుర్తుకు వచ్చే అంశం సస్పెన్షన్.
కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన గొప్ప గౌరవం
శాసనసభా వ్యవహారాల మంత్రి ద్వారా తమపై పైచేయి సాధిస్తున్న సభ్యులను సస్పెండ్ చేయమని స్పీకర్‌కు విన్నవిస్తారు. స్పీకర్ ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ శాసనసభ సమావేశాలపై యావత్ తెలుగు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. గత పది సంవత్సరాలుగా అత్యల్పంగా ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులపై నాటి టీఆర్‌ఎస్.. నేటి బీఆర్‌ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడేవారు.
అసలు కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చేవారు కాదంటే అతిశయోక్తి కాదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారపక్షంలోను, బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలోనూ ఉన్నాయి. దీంతో ఇక బీఆర్‌ఎస్‌కు సస్పెన్షన్‌ల తలనొప్పి తప్పదని అందరూ భావించారు. దీనికి భిన్నంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా జరుగుతున్న వైఖరికి భిన్నంగా ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు వింతైన విజ్ఞప్తి చేశారు. దీంతో సభ మొత్తం ఆశ్చర్య పోయింది.
సహజంగా ప్రతిపక్షాలను సస్పెండ్ చేయమని కోరే ముఖ్యమంత్రి ఈసారి మాత్రం ‘‘దయచేసి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయవద్దని మిమ్మల్ని కోరుతున్నా. వారు ఈ సభలో ఉండాలి. వారి పాలనలో జరిగిన దారుణాలు వారికి తెలియాలి. ఇక్కడ కూర్చుని కఠోర నిజాలు వినడం ద్వారా వారిలో పరివర్తన తీసుకురావాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దయచేసి వాళ్లల్లో ఎవరినీ బయటకు పంపొద్దు అధ్యక్షా…’’ అంటూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.