శతాబ్ధాల చరితగల దివ్య ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య. అలాగే అనేక వివాదాలకు నెలవుగా కూడా ఈ ప్రదేశం మారింది. సుధీర్ఘకాలం తర్వాత ప్రత్యేక న్యాయస్థానం అయోధ్యలోని రామజన్మభూమి విషయంలో హిందూ,
ముస్లిం వర్గాల మధ్య ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరిస్తూ తీర్పు చెప్పింది. దీంతో అక్కడ రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయి నిర్మాణం ప్రారంభమైంది.
ఈనెల 22న రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అధికారికంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగానే రామజన్మభూమి తీర్ధ ట్రస్ట్ ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే బలరాముని విగ్రహాన్ని ఈనెల 17న అయోధ్య నగరమంతా ఊరేగించాలని. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి.
అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. ఇది ఆధ్యాత్మికతతో కూడిన భారీ కార్యక్రమం కావడంతో భక్తులు ఊహించని స్థాయిలో వచ్చే అవకాశం ఉందని,
కాబట్టి ఏమాత్రం చిన్న తోపులాట జరిగినా, మరే సంఘటన జరిగినా పరిస్థితి ఊహకు కూడా అందనంత దూరం వెళ్లిపోతుందని,
దయచేసి ప్రజల ప్రాణాలను దృష్టిలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పోలీసు అధికారులు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల సూచనను పరిగణనలోకి తీసుకున్న ట్రస్ట్ చాలా కాలం ముందు నుంచి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకున్నందున అయోధ్య నగరం మొత్తం జరపాల్సిన బలరాముని విగ్రహ యాత్రను రామజన్మభూమి పరిసర ప్రాంతానికి పరిమితం చేసింది.
ఈనెల 22న రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉన్నందున ఇప్పటికే అయోధ్య పరిసర ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.
కావున తాము కూడా సహకరించాలని నిర్ణయించామని, ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో యాత్ర జరగాల్సిన ప్రాంతాన్ని కుదించుకున్నామని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు.