అధికారం మత్తులో ఉన్నంత వరకూ మన చాప కిందకు నీరు వచ్చినా ఎవరూ గ్రహించలేరు. తీరా గ్రహించే సరికి అప్పటికే తడవాల్సింది అంతా తడిసిపోతుంది. ఇక ఆ తర్వాత చేయగలిగింది ఏమీ ఉండదు కదా..
సరిగ్గా ఇప్పుడు ఆ తడిని చూసుకుని బాధపడుతున్నారు కేటీఆర్. ఎన్నికలకు ముందు వరకూ ప్రజలందరూ మనవైపే ఉన్నారు అనుకున్నాం అని, అందుకే అభివృద్ధి,
సంక్షేమం మీదే ఎక్కువగా కాన్‌సన్‌ట్రేషన్ చేశామని, తీరా చూస్తే ప్రజల అభిప్రాయం మరోలా ఉందని ఓటు ద్వారా నిరూపించారని అన్నారు.
బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరంగల్ లోక్‌సభ సన్నద్ధత సమావేశం నిర్వహించారు కేటీఆర్ ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. విధ్వంసమైపోయిన తెలంగాణను వికాసం వైపు నడిపించటానికి కేసీఆర్ తన చమట, రక్తం ధారపోశారని, గ్రామీణ అభివృద్ధికి ఆయన పడిన తపన, కృషి దేశంలో మరెవరు చేయలేదన్నారు.
తెలంగాణను టాప్‌లో నిలపటానికి 99శాతం సమయాన్ని పాలన కోసమే కేటాయించారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు, ప్రజలకు కూడా అందుబాటులోకి రాలేకపోయారు.
ఇకపై అలాంటి తప్పు జరగకుండా చూస్తారు. కార్యకర్తలు, నాయకుల్ని క్రమం తప్పకుండా ఆయన కలుస్తారు. అలాగే నేను, మిగిలిన పార్టీ పెద్దలు కూడా పార్టీ ఆఫీస్‌ను అడ్డాగా చేసుకుని అందరికీ అందుబాటులో ఉంటాము.
బీఆర్‌ఎస్‌ను ఉఫ్‌మని ఊదేయాలని 23 ఏళ్లుగా చాలామంది ప్రయత్నించారు. వారి వల్ల ఏకాణి కూడా కాలేదు. బీఆర్‌ఎస్ ప్రజల గొంతుక.
ప్రజాస్వామ్యం ఉన్నంత వరకూ బీఆర్‌ఎస్ ఉంటుంది. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదు. అందుకే 39 స్థానాలు ఇచ్చారు. మళ్లీ పునరుత్తేజంతో పనిచేద్దాం.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చూపిద్దాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ మన నాయకులపై, కార్యకర్తలపై కేసులు పెడుతోంది. మీరు భయపడకండి.
కేసుల తీవ్రతను బట్టి పార్టీకి సంబంధించిన లీగల్ ప్రతినిధులు మీకు అండగా ఉంటారు. కేసులకు భయపడే తత్వం మనది కాదు. న్యాయం వైపు, ప్రజల వైపు మనం నిలబడదాం అన్నారు.