పదవి అనే బెల్లం మన చేతుల్లో ఉన్నంత సేపూ కార్యకర్తలు, అభిమానులు మనచుట్టూనే ఉంటారు. ఒకవేళ అది కరిగిపోతోందని తెలిసిందో..
ఇక ‘‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’’ అని పాడుకోవాల్సిందే. ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని నాని పరిస్థితి అలాగే ఉంది.
గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అధిస్టానానికి కొరకరాని కొయ్యగా మారారు కేశినేని. ఆ పార్టీ కూడా ఇక సహించలేక ఆయనకు బదులుగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మొదలు పెట్టింది.
దీంతో పార్టీకి కేశినేనికి మధ్య మరింత దూరం పెరిగింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని బుధవారం జగన్‌ను కలిశారు.
త్వరలోనే పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతోపాటు టీడీపీ కేడర్ కూడా భారీగా వైసీపీ కండువాలు కప్పుకుంటారని జగన్‌కు మాట ఇచ్చారు.
నాని ఇచ్చిన మాటను నమ్మిన వైసీపీ అధిష్టానం ఇక విజయవాడ ఎంపీ మనదే అని ఊపిరి పీల్చుకోవాలి అనుకుంది. అయితే అతి విశ్వాసంతో అనవసర రచ్చ చేసుకున్న నానికి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కేడర్ జలక్ ఇస్తున్నారు.
ఈయనేమో జిల్లాలో 60 శాతం టీడీపీ కేడర్ నా వెంట వైసీపీలోకి వస్తారు అని చెప్పి వచ్చారు. తీరా చూస్తే నానికి ప్రధాన అనుచరగణంగా ఉన్న వారు కూడా ఇప్పుడు ఆయన మాట వినడంలేదట.
పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలోని కేడర్‌కు ఫోన్ చేసి వైసీపీలోకి వెళదాం రండి అని చెపుతుంటే వారు సున్నితంగా తిరస్కరిస్తున్నారట.
నానికి ముఖ్య అనుచరుడు, పార్లమెంట్ పరిధిలోని 4 నియోజక వర్గాలలో మంచి పట్టు ఉన్న విజయవాడ గొల్లపూడికి చెందిన బొమ్మసాని సుబ్బారావు కూడా నేను మీ వెంట వైసీపీలోకి రాను అని తెగేసి చెప్పారట.
జగన్ దగ్గర బొమ్మసానికి కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ పెట్టారు నాని. ఇప్పుడు అదే బొమ్మసాని ఇలా షాక్ ఇవ్వడంతో కేశినేనికి దిమ్మతిరిగి పోతోంది.
దీనికి తోడు వైసీపీ అధిష్ఠానం కూడా అసలు కేశినేని వెంట ఎంతమంది వస్తారు అనే విషయంపై ఓ కన్నేసి ఉంచిందట. పరిస్థితి ఇలా ఉంటే తన సీటుకే ఎసరు పెట్టినా పెట్టేస్తాడు జగన్ అని కేశినేని మధనపడుతున్నారట.