ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దశాబ్దాల నుంచి సాగుతున్న దారిని మార్చి కొత్త కొత్త రూట్‌లను నాయకులు ఎంచుకుంటున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 40కి పైగా ఎమ్మెల్యేలను, దాదాపు 10 ఎంపీలను వారి నియోజకవర్గాల మార్పు చేపట్టారు.
ఇందులో కొందరికి స్థాన చలనం కలిగించగా, మరికొందరికి ఏకంగా సీట్లను ఇవ్వటానికి నిరాకరించిన విషయం తెలిసింది.
సీట్లు కోల్పోయిన వారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, స్థానచలనం కలిగిన వారు ఇప్పటికే తమ తమ స్థానాల్లో ఏర్పరచుకున్న పట్టును కోల్పోనున్నారు.
ఇప్పుడు వచ్చిన చిక్కల్లా.. టిక్కెట్లు దక్కక పార్టీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న నాయకుల భవిష్యత్తు ఏంటనేదే. పార్టీపైన, అధినేత పైన కోపం ప్రదర్శిస్తున్నప్పటికీ, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి?
ఏమని చెప్పాలి అనేదే పెద్ద సమస్యగా మారింది. వీరిలో కొందరు తమ నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో పట్టు కలిగి ఉండడం వల్ల వారికి పెద్ద ఇబ్బంది లేదు. ఉదాహరణకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,
ఆనం రామనారాయణరెడ్డి వంటి వారు. కానీ కొందరు పార్టీ నుంచి దాదాపు గెంటివేయబడేంత వరకూ అక్కడే ఉన్నారు.
ఇప్పుడు వీరందరూ ప్రజల్లోకి వచ్చి పార్టీ మాకు అన్యాయం చేసింది. మా గొంతు కోసింది. మీరే మాకు అండగా నిలబడాలి అంటే.. ప్రజలు మాత్రం ఊరుకుంటారా? ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు సరే..
మరి ఇంతకాలం అధికారంలోనే ఉన్నారు కదా. మాకు ఏం చేశారు అని నిలదీస్తే పరిస్థితి ఏంటి?. ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని మా దగ్గరకు వచ్చారు సరే.. నిన్న మొన్నటి వరకూ మా ముఖాలు కూడా చూడలేదు కదా అంటే ఎలా?..
మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే కేవలం సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో అభివృద్ధిని పక్కన పడేశారు కదా… మన నియోజకవర్గానికి, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి అంటే…
అభివృద్ధి సరే.. ఉపాధి కోసం యువతకు, ఇతర వర్గాలకు ఏం చేశారు? అని ఎదురు తిరిగితే.. పైపెచ్చు నిన్నటి వరకూ తిట్టిపోసిన ప్రతిపక్షం పంచన ఈరోజు చేరడం గురించి కూడా నిలదీస్తే.. ఇలా రకరకాల ప్రశ్నలు బహిష్కృత నాయకుల మదిలో గందరగోళం సృష్టిస్తున్నాయి.