అసలు ప్రారంభ లక్ష్యం ఒకటైతే.. మన ప్రయాణం ఒక్కోసారి మరెటో వెళుతుంది. ఎన్నో కలలతో, లక్ష్యాలతో, వెంటనడిచే మంది, మార్భలంతో మొదలయ్యే రాజకీయ ప్రయాణం ఇలా ఎటో అనుకుంటే..
మరెటో వెళుతుంటే పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ప్రస్తుతం వై.యస్. షర్మిళ రాజకీయ పయనం ఇలాగే ఉంది.
2009లో తండ్రి వై.యస్. రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని జగన్ తీసుకున్నారు. తండ్రి మరణించిన కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పేరుతో ఓ పార్టీని స్థాపించి స్వంత రాజకీయ వేదికను మొదలు పెట్టారు.
వైయస్సార్ కూతురు షర్మిళ మాత్రం అన్న జగన్మోహన్రెడ్డి కోసం ప్రచారం చేసినప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. జగన్ను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పార్టీని కాపాడటానికి సాహసోపేతంగా 3వేల కి.మీ. పాదయాత్ర నిర్వహించారు షర్మిళ.
2019లో అధికారం చేపట్టిన జగన్ ఎన్నికలకు ముందు చెల్లికి రాజ్యసభ హామీ ఇచ్చారు. దాన్ని అటకెక్కించడంతో ఇద్దరి మధ్య విబేధాలు పొడ చూపాయి.
దీనికి తోడు అధికారం చేతిలో ఉండడంతో షర్మిళకు తండ్రి ఆస్తిలో వారసత్వంగా రావాల్సిన వాటాను కూడా జగన్ ఎగ్గొట్టడంతో ఆ దూరం మరింత పెరిగింది.
ఈ కారణంగా షర్మిళ రాజ్యాధికారం ఉంటేనే న్యాయం జరుగుతుంది అని భావించి తెలంగాణలో వైఎస్సార్ టీపీని స్థాపించారు. తాను తెలంగాణ కోడల్ని కాబట్టి తనకు ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉంది అని వాదించారు.
మొన్నటి ఎన్నికల్లో తన పార్టీని పోటీ నుంచి తప్పించి, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. ఎన్నికలకు ముందే షర్మిళ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.
ఇప్పుడు దానికి సంబంధించిన సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. షర్మిళను కాంగ్రెస్పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నాయకత్వం వహించమని కోరింది. ఒకటి రెండు రోజుల్లోనే ఆమె ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోయే తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ఈ మేరకు అనధికార వార్తలు పలు మీడియాల్లో వచ్చినప్పటికీ, ఈరోజు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన రాజకీయ భవిష్యత్తు షర్మిళగారితోనే అని ప్రకటించడంతో షర్మిళ ఆంధ్ర ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది.
తెలంగాణలో తెలంగాణ కోడలు అన్న కార్డు వాడిన ఆమె, ఇప్పుడు ఆంధ్రా కూతురిని అన్న కార్డు వాడుతారన్నమాట. చూడాలి ఆంధ్రా కాంగ్రెస్లో ఆమె రాకతో వచ్చే మార్పులేమిటో.