వాళ్లు వచ్చినా నేను చెప్పేది మాత్రం ఇదే అన్నారట నాగ్‌

0
915

రోజులు మారాయి.. ఈతరం కదిలింది.. సొమ్మొకడిది సోకొకడిది.. ఇదేంటి పాత సినిమాల టైటిల్స్‌ ఇలా వరుసగా వదులుతున్నారు అనుకుంటున్నారా. మరేం లేదండి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక్కో పిరియడ్‌లో ఒక్కో విధంగా వ్యవహారాలు సాగుతుంటాయి. అదే విధానం పరిశ్రమ ఉన్నంతకాలం ఉండాలంటే కుదరదు కదా. సినిమా బిజినెస్‌ విషయంలో ఇది మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో అయితే నిర్మాణం పూర్తి చేసుకున్న తమ సినిమా విడుదల అనేది ఆ నిర్మాత చేతుల్లోనే ఉండేది.

విడుదలకు మోకాలడ్డటం కామన్‌

కానీ ప్రస్తుతం సినిమా తీయటం మాత్రమే నిర్మాత చేతుల్లో ఉంటుంది. విడుదల అనేది ఓ నలుగురైదుగురు పెద్ద నిర్మాతల చేతుల్లో ఉంటుంది. వారి పెదరాయుడు తీర్పులతోనే సినిమాల డేట్‌లు ఫిక్స్‌ అయ్యేది. ఇదో కొత్త ట్రెండ్‌. సంవత్సరాల తరబడి సినిమాలను సాగదీయడం.. విడుదల దగ్గర పడగానే ఇతరుల సినిమాల మీద పడి వాటి విడుదలకు మోకాలడ్డటం కామన్‌ అయిపోయింది. ఇలా అన్ని సినిమాలకు మోకాలు అడ్డడం కుదరకు పోవచ్చు.

వారి జోలికి వెళ్లక పోవడమే బెటర్‌

కొందరుంటారు వారిని కన్విన్స్‌ చేయటం కన్నా వారి జోలికి వెళ్లక పోవడమే బెటర్‌. అటువంటి వారిలో అక్కినేని నాగార్జున ఒకరు. తాజాగా 2022 సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాలను డిసైడ్‌ చేసింది ఈ నిర్మాతల గ్యాంగ్‌. ముందు రావాల్సిన సినిమాలను వెనుకకు, వెనుక రావాల్సిన సినిమాలను ముందుకు, మరికొన్నింటిని ఏకంగా ఏప్రిల్‌కు జంబ్లింగ్‌ చేసి తమకు కావాల్సిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. రాధేశ్యామ్‌లను సంక్రాంతి బరిలోకి దింపేశారు.

‘బంగార్రాజు’ ను టచ్‌ చేయలేక పోయారు

భీమ్లానాయక్‌, ఆచార్య, సర్కారువారిపాట, విరాఠపర్వం ఇలా కొన్ని చిత్రాలు ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధేశ్యామ్‌లకు దారిచ్చి తాము మరింత వెనక్కు జరిగాయి. మిగిలిన సినిమాలను అయితే మేనేజ్‌ చేయగలిగారు గానీ నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాను మాత్రం టచ్‌ చేయలేక పోయారు. ఈ సినిమాకు నాంది అయిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ గతంలో సంక్రాంతికే వచ్చి సూపర్‌హిట్‌ కొట్టింది. ఈ బంగార్రాజును కూడా సంక్రాంతికి వదలాలని సినిమా ప్రారంభం అప్పుడే నిర్ణయించుకున్నారు.

నాగార్జున దగ్గర మాత్రం పప్పులు ఉడకలేదట

ఆర్‌.ఆర్‌.ఆర్‌. రాధేశ్యామ్‌ చిత్రాలకు దారి సుగమనం చేయటానికి కంకణం కట్టుకున్న పెదరాయుడుల పప్పులు నాగార్జున దగ్గర మాత్రం ఉడకలేదట. మిగిలిని సినిమాల నిర్మాతలను ఒప్పించినట్టుగా నాగార్జునను కూడా ఒప్పించాలని అనుకున్నప్పటికీ, ముక్కుసూటిగా మాట్లాడే నాగార్జునతో వ్యవహారం కాబట్టి ముందుగా నాగార్జునకు సన్నిహితుడైన ఓ పెద్ద తలకాయతో ‘బంగార్రాజు’ను సంక్రాంతి నుంచి వెనక్కు జరిపితే బాగుటుందేమో అని కదిపారట.

సంక్రాంతికి వచ్చి తీరుతుంది

దానికి నాగ్‌ ‘‘నా సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చి తీరుతుంది. ఇందులో మరో మాటే లేదు. ఒకవేళ వారు వచ్చినా నేను చెప్పేది ఇదే’’ అన్నారట. ఆ పెద్దతలకాయ చెప్పిన ఈ మాట విన్న మన పెదరాయుళ్ళు ‘బంగార్రాజు’ జోలికి వెళ్లే ఆలోచనను అక్కడిక్కడే విరమించుకున్నారట.