సినిమా అంటేనే చెప్పుకోలేని టెన్షన్. కథ అనుకున్న దగ్గర నుంచి దాన్ని జాగ్రత్తగా తెరకెక్కించడం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, విడుదల చేయడం వరకూ అంతా టెన్షనే.
ఇంత కష్టపడి చేసిన సినిమా విజయం సాధిస్తే ఇక ఆ టెన్షన్స్ అన్నీ మటుమాయం అయిపోతాయి. ఒకవేళ తేడా కొట్టిందో అసలు టెన్షన్‌లకు అదనంగా మరిన్ని టెన్షన్‌లు.
ఈ టెన్షన్‌ల మధ్య ఒక్కోసారి ఎవరిని ఏమంటున్నామో కూడా తెలియదు. ఎవరిని మెప్పిస్తున్నామో.. ఎవరిని నొప్పిస్తున్నామో కూడా గుర్తించలేం.
అలాంటి టెన్షన్‌లలో ఉన్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమర్ మెగాస్టార్ చిరంజీవిని చెడామడా తిట్టేశారు. ఆ తిట్ల దండకానికి ఖంగు తినడం చిరంజీవి వంతు అయింది. సాయంత్రం మళ్లీ ఆయనే ఫోన్ చేసి సారీ చెప్పారనుకుండి.
వివరాల్లోకి వెళితే క్రాంతి కుమర్ గారు మంచి అభిరుచిగల నిర్మాత, దర్శకుడు కూడా. ఎంత మంచివారో.. కోపం వస్తే అంత చంఢశాసనుడు కూడా. 1978లో చిరంజీవిని ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో పరిచయం చేశారు.
ఆ తర్వాత 1980లో చిరు హీరోగా ‘మోసగాడు’ నిర్మించారు. ముచ్చటగా మూడో చిత్రంగా ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘న్యాయం కావాలి’ (1981) సినిమా నిర్మిస్తున్నారు.
ఓ రోజు వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఉదయం ప్రారంభం అయిన షూటింగ్ మధ్యాహ్నం వరకూ నిర్విరామంగా జరిగింది.
లంచ్ బ్రేక్ కూడా తక్కువ సమయమే ఇచ్చారు. ఉదయం నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తున్న చిరంజీవికి షాట్ గ్యాప్ వచ్చింది.
రాధికపై ఇతరులపై సీన్‌లు తీస్తున్నారు. అప్పటికే అలిసిపోయిన చిరంజీవి కాస్త రిలాక్స్‌గా ఉంటుందని ఫ్లోరు బయటకు వచ్చి ఓ చెట్టుకింద నిలబడి ఉన్నారు.
అప్పుడే లోపల ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు ఏదో ఇంపార్టెంట్ ఐటమ్ అరేంజ్ చేయడం మర్చిపోవడంతో వారిపై చిందులు తొక్కుతూ బయటకు వచ్చారు క్రాంతి కుమార్.
ఎదురుగా చిరంజీవి చెట్టుకింద నిలబడటం చూసి, ఏం చిరంజీవి లోపల కూర్చోవడం ఇబ్బందిగా ఉందా? నీ కోసం మనుషులు వచ్చి ప్రత్యేకంగా పిలవాలా? పోనీ పేకప్ చెప్పేయమని చెప్పనా? అంటూ సీరియస్ అయ్యారు.
ఊహించని ఈ సంఘటన చిరంజీవిని చాలా ఇబ్బంది పెట్టింది. అదే రోజు సాయంత్రం చిరంజీవికి ఫోన్ చేసిన క్రాంతికుమార్ గారు ‘‘సారీ చిరంజీవి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ల వల్ల మధ్యాహ్నం బీపీ వచ్చింది.
ఆ కోపం కాస్తా మనవాడివే కదా నీ మీదు కొంత చూపించాను. ఏమీ అనుకోకు’’ అన్నారు. దానికి చిరంజీవి ‘‘మీ ప్రేమను గెలుచుకోవడం నిజంగా నా అదృష్టం. మీరు తిట్లు అనుకుంటున్నారు.
నేను అవి మీరు నాకు బాధ్యతలు గుర్తు చేయడం అనుకుంటున్నాను’’ అన్నారు. ఆ తర్వాత క్రాంతి కుమార్ గారు చిరంజీవితో కిరాయిరౌడీలు, ఇది పెళ్లంటారా, శివుడు శివుడు శివుడు, అగ్నిగుండం, రిక్షావోడు చిత్రాలను నిర్మించారు.