ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒకటే చర్చ. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం. అదీ హైదరాబాద్ నుంచి లోకేష్ అతన్ని వెంటబెట్టుకుని ప్రైవేట్ జెట్‌లో గన్నవరం రావడం..
అక్కడి నుంచి ఇద్దరూ ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం.. చంద్రబాబుతో దాదాపు 2 గంటల పాటు పీకే చర్చలు జరపడం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన పీకే కొద్ది కాలంగా జగన్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయన శిష్యులైన రాబిన్ శర్మ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉండగా, ప్రశాంత్ కిషోర్ మరో శిష్యుడు…
వైఎస్సార్సీపీకి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మాత్రం ‘ఐ ప్యాక్’ నుంచి తప్పుకుని స్వంతంగా రాజకీయ పార్టీని స్థాపించుకుని బీహార్‌లో పాదయాత్ర కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో పీకే సడన్‌గా చంద్రబాబును కలవడం సంచలనంగా పేర్కొనవచ్చు.
అయితే 2019 ఎన్నికల తర్వాత రాబిన్‌శర్మ ఆధ్వర్యంలో టీడీపీ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి తోడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించి నాయకుల్ని ఫైనలైజ్ చేశారు.
ఈ దశలో పీకే అభ్యర్ధుల విషయంలో కలుగ జేసుకునే అవకాశం లేదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాబట్టి పీకే రాబోయే ఎన్నికల్లో సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం బాధ్యతలు మాత్రమే తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
దీనికి తోడు పార్టీకి సంబంధించి ఏఏ కార్యక్రమాలు ఏఏ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఎలా నిర్వహించాలనే విషయంలో సలహాలు ఇవ్వొచ్చు.
మరోవైపు పీకే స్ట్రాటజీలు అన్నీ సమాజంలో వివిధ వర్గాల్లో అశాంతిని రేకెత్తించేవిగా ఉంటాయి కాబట్టి అతన్ని ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కాదనే వాదనలు కూడా టీడీపికి సంబంధించిన కొందరి నుంచి వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అతన్ని చంద్రబాబు ఏ మేరకు విశ్వసిస్తారో చూడాలి.