కథ కన్నా ‘పుష్ఫరాజ్‌’ను ఎక్కువగా ప్రేమించిన సుకుమార్‌.. ‘పుష్ప’ రివ్యూ

0
1213

సినిమా అనేది ఒక కళ… అది కొందరికి అద్భుతమైన కల. ఆ కలను నెరవేర్చుకోవటానికి ఎంతో కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ జీవితాలను పణంగా పెడతారు. కోట్లు కుమ్మరిస్తారు. చివరికి తెరమీద బొమ్మ అదుర్స్‌ అనిపించి, కనక వర్షం కురిపిస్తేనే వారి కష్టం ఫలించినట్లు. అలా కొన్ని వందల మంది యూనిట్‌ సభ్యులు, కోట్లాది రూపాయల బడ్జెట్‌తో గత రెండు సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పుష్ప’ సినిమా.

కథగా చెప్పాలంటే ఆత్మగౌరవం మెండుగా ఉన్న సాధారణ కూలీ అయిన ‘పుష్పరాజ్‌’ ఎర్రచందనం కూలీగా మారి.. లారీల కొద్దీ దుడ్డు (డబ్బు) చేతులు మార్చే డాన్‌గా ఎదగటం. మూలకథ లైన్‌ సింపులే అయినా.. అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరో, సుకుమార్‌ వంటి క్రియేటివ్‌ జీనియస్‌ దర్శకత్వం, భారీ చిత్రాలక్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అయిన మైత్రీ మూవీస్‌ నిర్మాణం, రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం, స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రష్మిక మందన్నా డీ గ్లామర్‌ పాత్ర, సమంతా ఐటెమ్‌ సాంగ్‌, ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌ సినిమాకు విపరీతమైన హైప్‌ క్రియేట్‌ చేసింది.

‘పుష్పరాజ్‌’ పాత్రను మాత్రమే ప్రేమించారు

ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అనే ఉత్తుకతను ప్రేక్షకుల్లో కలిగించింది. పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కావడంతో పాన్‌ ఇండియా చిత్రంగా మీడియా అటెన్షన్‌ గ్రాబ్‌ చేసింది. అయితే సుకుమార్‌ స్క్రిప్ట్‌ చతురత మీదే అందరూ ఎక్కువగా దృష్టి పెట్టారు. తన గత చిత్రాల కథలలో అనేక ట్విస్ట్‌లతో, సహజత్వంతో ప్రేక్షకులను కట్టి పడేసిన సుకుమార్‌ ఈ సినిమాకు వచ్చే సరికి మొత్తంగా కథను కాకుండా కేవలం ‘పుష్పరాజ్‌’ పాత్రను మాత్రమే విపరీతంగా ప్రేమించారు అనటం అతిశయోక్తి కాదు.

గతంలో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అనేక సినిమాలు వచ్చినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన ఎర్రచందనం చెట్ల స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ కావడం కలిసొచ్చే అంశం. సుకుమార్‌ కేవలం ఈ బ్యాక్‌డ్రాప్‌ను, పుష్పరాజ్‌ పాత్రను ఎక్కువగా ప్రేమించడంతో, ఆయన్నుంచి ప్రేక్షకులు ఆశించిన ట్విస్ట్‌లు లేకుండా పోయాయి. సినిమా మొత్తం పుష్పరాజ్‌ చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో దాదాపు ప్రతి ఫ్రేమ్‌లోనూ అల్లు అర్జున్‌ కనపడతాడు. అతని తల్లి, కుటుంబ బ్యాక్‌ గ్రౌండ్‌కు సంబంధించి సుకుమార్‌ రాసుకున్న కథ కూడా ప్రేక్షకులకు అంతగా జీర్ణం కాదు.

సమంతనే ఎందుకు తీసుకున్నారనే అనుమానం

శ్రీవల్లి పాత్రలో రష్మిక, పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌లు అద్భుతమైన నటన కనబరిచారు. మిగిలిన ప్రధాన పాత్రలు అయిన సునీల్‌, రావురమేష్‌, అనసూయ, అజయ్‌ఘోష్‌లలో అజయ్‌ ఘోష్‌కి చెప్పుకోదగ్గ స్కోప్‌ దక్కింది. రావు రమేష్‌ కూడా తన పాత్ర పరిధిమేర నటించారు. విలనిజం పండిరచాల్సిన మంగళం సీను(సునీల్‌) పాత్ర విలనిజానికి మంగళం పాడేసినట్లు అనిపిస్తుంది.

సుకుమార్‌ అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పెట్టింది పేరు. అయితే ఇందులో వారిని అకట్టుకునే అంశాలు పెద్దగా లేవని చెప్పాలి. సమంత చేసిన ఐటెమ్‌ సాంగ్‌కు దాదాపు 5 కోట్లు(ఆమె రెమ్యునరేషన్‌తో సహా)ఖర్చు చేశారంటూ ప్రచారం జరిగింది. తెరమీద ఈ పాటను చూసిన ప్రేక్షకులకు ఈ పాట కోసం సమంతనే ఎందుకు తీసుకున్నారనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఇటువంటి యాక్షన్‌ బేస్డ్‌ కథలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రాణం లాంటిది. ఈ విషయంలో దేవిశ్రీప్రసాద్‌ దాదాపుగా విఫలం అయ్యాడు.

ఆశించిన రంగులేని ఎర్రచందనం

కేవలం సాంగ్స్‌ మీద మాత్రమే అతను దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. కెమెరామెన్‌ మిరోస్లా క్యూబా బ్రోజెక్‌ పనితనం, ఆర్ట్‌ డైరెక్టర్స్‌ రామకృష్ణ`మౌనికల కష్టం ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలో చాలా భాగం హైదరాబాద్‌లోనే సెట్స్‌ వేసి చిత్రీకరించారు. చిత్తూజిల్లా పల్లెలను, శేషాచలం అడవులను అచ్చు గుద్దినట్లుగా దింపేశారు ఆర్ట్‌ డైరెక్టర్స్‌.ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో 29 పెద్ద సెట్స్‌ను వేశారంటే అర్ధం చేసుకోవచ్చు వారి కష్టం. కెమెరామెన్‌ క్యూబా ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా, రిచ్‌గా చూపించారు. తొలి భాగంలోనే దాదాపు అ సినిమా క్లైమాక్స్‌ పూర్తయిపోతుంది.

కానీ రెండో భాగం కొనసాగింపు కోసం అన్నట్లుగా చొప్పించిన సీన్‌లు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. పాటలు లేకపోతే ఈ సినిమా మరింతగా ప్రేక్షకులను నిరాశపరిచేదే. మొత్తంగా చెప్పాలంటే ఆశించిన రంగులేని ఎర్రచందనం ఈ ‘పుష్ప’.

రేటింగ్ : 2.5 / 5