‘అర్జున్ రెడ్డి’ విడుదల రోజునే ‘లైగర్‌’

0
621

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవర కొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ షూటింగ్‌ పూర్తి కావచ్చింది. తాజాగా ఈ చిత్రం అమెరికా లో తీసిన షెడ్యూల్ లో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైషన్‌, విజయ్‌ దేవరకొండ, అనన్యపాండేలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకా ఒక చిన్న షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉండగా దీనిని మన దగ్గరే తెరకెక్కిస్తారు. ఈ మేరకు దీనికి సంబంధించి విజయ్‌ దేవర కొండ అభిమానులకు డబుల్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చారు నిర్మాతలు. ఈ సినిమా 2022 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ పోస్టర్‌ విడుదల చేశారు.

అంతేకాకుండా సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఈనెల 31 విడుదల చేయనున్నట్లు చెప్పారు. ‘‘ఈ కొత్త సంవత్సరం.. మంట పుట్టిందాం’’ అంటూ నిర్మాతలు అభిమానుల్లో జోష్ పెంచారు. విజ‌య్ దేవ‌ర‌కొండ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ కూడా 2017 ఆగ‌స్ట్ 25నే విడుద‌ల‌ కావడం విశేషం. సరిగ్గా నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అదే రోజున వ‌స్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ‘లైగ‌ర్’ కూడా విజ‌య్ కి మ‌రో క‌ల్ట్, ఐకానిక్ మ‌రియు ట్రెండ్ సెట్టింగ్ మూవీ కానుందని భావిస్తున్నారు.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారతదేశంలోని అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ లలో ఒకటిగా అలరించనుంది. అంతేకాకుండా ఇందులో లెజెండ్ మైక్ టైసన్ శక్తివంతమైన పాత్రను చేస్తుండడంతో అంచనాలు విపరీతంగా పెరిగాయి. బిగ్ స్క్రీన్ పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మైక్‌ టైసన్ నిజమైన యాక్షన్ ను చూసేందుకు అభిమానులు .. సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ నూత‌న సంవ‌త్స‌రం గ్లిమ్స్ యాక్ష‌న్ అభిమానుల‌కు మంచి ట్రీట్ కానుందని ఆశిస్తున్నారు.

ఈ సినిమాని పూరీ కనెక్ట్స్ తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మాణం చేపడుతుంది. డైరెక్టర్‌ పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. థాయ్ లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా
హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో వస్తుంది. కాగా లైగర్ లో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.