జనవరి 2న వైసీపీ గూటికి ముద్రగడ

0
347
mudragada padmanabham ycp

ఆంధ్రరాష్ట్రంలో కాపు కులం కోసం అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాపు సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పోరాటం చేసిన వారిలో ముద్రగడ పద్మనాభం ఒకరు. కాంగ్రెస్‌ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే కాపు రిజర్వేషన్‌ కోసం ఆయన చేసిన ఉద్యమం కాపు సామాజికవర్గంలో ఆయనకో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో ఈయన మరోసారి తన గళాన్ని వినిపించారు.

mudragada padmanabham ycp

జగన్‌ అలాచేస్తే బాబుకు పవన్‌ రాం రాం

కాపుల రిజర్వేషన్స్‌ కోసం పళ్లాల మోత దగ్గర నుంచి వివిధ రూపాల్లో ఆయన తన గళం వినిపిస్తూనే.. మిగిలిన కాపు సోదరులను సైతం కూడగట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వ హయాంలో ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగి నానా హంగా సృష్టించారు.

ఆ తర్వాత తునిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తుని రైల్వే స్టేషన్‌కు దగ్గర్లోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఈ సభను నిర్వహించడంతో ఆ సభకు హాజరైన కొందరు ఆవేశపరులు విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. అప్పట్లో ఇదో సంచలనం.

చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్స్‌ కోసం నానా యాగీ చేసిన ముద్రగడ 2019లో జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఉద్యమం ఊసే మర్చిపోయారు. జగన్‌ను నిలదీయడం అటుంచి ఏకంగా ఆయనకు మద్దతుగా ఒకటి, రెండు సందర్భాల్లో లేఖలు కూడా విడుదల చేశారు.

తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు ముద్రగడ జనవరి 2న వైసీపీలో అధికారికంగా చేరుతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ఇంతకు ముందు ఆయన ప్రకటించారు.

అయితే రాబోయే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబులు కూటమిగా పోటీ చేస్తున్న తరుణంలో కాపు ఓట్లను పవన్‌కు, తద్వారా తెలుగుదేశం పార్టీకి పడకుండా చేయాలనే కుట్రతోనే ముద్రగడ వైసీపీలో చేరి, కాపులను దారి మళ్లించే పని చేపట్టనున్నారని ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు గుసగుసలాడు కోవడం విశేషం.