రవాణా శాఖ సంచలన నిర్ణయం.. ఇక ఆ కార్డులు లేనట్టే..?

0
370

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల్లోని చిప్ వ్యవస్థకు రవాణా శాఖ మంగళం పాడిందని తెలుస్తోంది. 13 ఏళ్లక్రితం ప్రతిష్టాత్మకంగా చిప్ కార్డులను ప్రవేశపెట్టగా.. అవి ఆధునిక పద్ధతికి అనుగుణంగా పని చేసేవి. చిప్ లలో వాహదారుడు, వాహనానికి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేసేవారు. కానీ ఆ విధానాలకు శాఖ మంగళం పాడినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా జారీ చేసిన కార్డుల్లో చిప్ లేకుండా వాహన దారులు, వాహనానికి సంబంధించిక పూర్తి వివరాలు తెలిసేలా అందజేస్తున్నారు. అంటే చిప్ వ్యవస్థకు మంగళం పాడినట్లేనంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

రవాణా శాఖ పై విమర్శలు

ఇటీవల చాలా రోజుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్సీ, తదితర కార్డులను సదరు రవాణా శాఖ జారీ చేయడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వాహన సంబంధిత పత్రాలు లేకపోవడంతో వెహికిల్స్ ను బయటకు తీసేందుకు జంకుతున్నారు. ఇక చలానాల విషయం అందరికీ తెలిసిందే. సదరు శాఖ కార్డులు ఇవ్వకపోగా, విసృతంగా తనిఖీలు చేపట్టి మరీ కార్డులు లేని వాహనాలకు భారీగా జరిమానా విధించింది. దీంతో వాహదారులు గగ్గోలు పెట్టారు.

దిగుమతులు ఉన్నా కొరవడిన ప్రణాళిక

ముఖ్యంగా కార్డుల్లో ఉపయోగించే చిప్స్ తైవాన్, చైనా, తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. గతంలో కొంత కాలం వీటి దిగుమతి విషయంలో జాప్యం జరుగుతుండడంతో కార్డుల జారీ నిలిపేశారు. అయితే ఈ మధ్య కాలంలో చిప్ లు వస్తున్నా చిప్ కార్డులను మాత్రం రవాణా శాఖ జారీ చేయడం లేదు.

పాత విధానానికే మొగ్గు

పౌరసేవలు పారదర్శకంగా ఉండాలనే రవాణా శాఖ 2009లో త్రీటైర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న టూటైర్ స్థానంలో ఈ వ్యవస్థను తెచ్చారు అధికారులు. దీంతో ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయం నుంచే కింది స్థాయి కార్యాలయాలకు సేవలను అందించేవారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, వాహన బదిలీ తదితర పత్రాలు అవసరం లేకుండా చిప్స్ రూపంలో సమాచారం నిక్షిప్తం చేసి అందించారు. దీంతో పత్రాల స్థానంలో చిప్స్ వచ్చి చేరాయి. వీటి కాస్ట్ కొంచెం ఎక్కువైనా పత్రాలను మోసుకుతిరగాల్సిన అవసరం వినియోగదారులకు తప్పింది.

నకిలీలు మళ్లీ వచ్చేనా..?

చిప్పులలో వాహదారుడు, బదిలీ, ఆర్సీ తదితర సమాచారాన్ని నిక్షిప్తం చేసే వారు. ఇలాంటి సమయంలో నకిలీలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలిగారు ఆర్టీఏ అధికారులు. వాహనదారుడికి కూడా పూర్తి భద్రత లభించింది. ఏ రాష్ర్టంలో లేని సమయంలో మన రాష్ర్టంలో తీసుకురావడంతో మొదట వాహనదారులు సంతృప్తి చెందారు. కానీ చిప్ లకు సంబంధించి రీడిండ్ మిషన్లను శాఖ సమకూర్చుకోలేక పోయింది. వాహన ప్రమాదం, చోరీకి గురవడం, తదితర సమయాల్లో వాహన యజమానిని గుర్తించేందుకు చిప్ లే ప్రధాన భూమిక పోషించేవి.

చిప్ ల దిగుమతిలో ఆటంకాలు

కానీ రీడర్లు లేకపోవడంతో అధికారులు కూడా ఏం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో చిప్ లు కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఉన్నాయి. చిప్ ల దిగుమతిలో ఆటంకాలు, శాఖ వద్ద లేని రీడింగ్ మిషన్ల, తదితరాలను సాకుగా చూపుతూ త్రీటైర్ వ్యవస్థకు రవాణా శాఖ మంగళం పాడింది. చిప్ కార్డుల స్థానంలో వినియోగదారుల పూర్తి వివరాలతో కార్డులను అందిస్తుంది. చిప్ వ్యవస్థను రద్దు చేయడంతో నకిలీలకు చెక్ పెట్టే అవకాశాలు తగ్గుతాయని, మార్కెట్లో మరిన్ని నకిలీ కార్డులు వస్తాయని వినియోగదారులు వాపోతున్నారు.