కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చిన 4 ఎమ్మెల్యేలు

0
396
kcr

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇది నిజమే. అవసరార్ధం పార్టీలు మార్చే నేతలు ఉన్నంతకాలం ఈ సామెతకు తప్పకుండా విలువ ఉంటుంది. కేవలం తమ అవసరాలే తప్ప ప్రజల అవసరాలు పట్టని నేతలకు ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది.

తాజాగా జరిగిన ఓ పరిణామం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి క్లూను ఇస్తున్నట్లుగా ఉంది. విషయంలోకి వెళితే.. మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు.

సహజంగా ఇలాంటి కలయికలను మర్యాదపూర్వక భేటీలు అంటూ సమర్ధించుకోవడం మనకు తెలిసిందే. వీరు కూడా అదే విషయాన్ని చెప్పారు.

kcr

విదేశీ పర్యటను ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని మెదక్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకరరెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావులు ఆయన నివాసంలో కలిశారు.

వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ హాట్‌ చర్చకు దారి తీసింది. కేవలం మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశామని, అలాగే ప్రొటోకాల్‌ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చామని వారు మీడియాకు చెప్పారు.

ఒక వేళ మర్యాద పూర్వక భేటీ అయితే అపొజిషన్‌ పార్టీ లీడర్లు అయిన వారు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిస్తే ఎటువంటి అనుమానాలకు తావు ఉండదు.

కానీ వీరు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ భేటీ బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి తెలిసి జరిగిందా? లేక వీరు స్వతంత్రంగా నిర్ణయించుకుని వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

ఇటీవల కాలంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా పదే పదే కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అస్థిరతపై వ్యాఖ్యలు చేస్తుండడం, 6, 7 సీట్లు అటు, ఇటు అయితే ప్రభుత్వం గల్లంతు అవుతుందని వ్యాఖ్యానించడంతో రేవంత్‌ ఆకర్ష్‌ మంత్రాన్ని ప్రయోగించటానికి సిద్ధపడ్డారా అనే అనుమానం ఈ భేటీతో కలుగుతోంది.

దీనికి తోడు ఇటీవలే రేవంత్‌ కేసీఆర్‌ మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని నేను భావించడం లేదు. ఒకవేళ ఆయన అలాంటి రాజకీయానికి తెరతీస్తే పరిణామాలు ఆయన ఊహకు కూడా అందవు అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం గమనించాలి.