మెట్రో రైల్ విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేక్

0
436
revanth reddy metro rail

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు మామూలు రేంజ్ లో లేదు. ప్రతీ విషయం లోను తన మార్కు పాలనతో అదరగొట్టేస్తున్నాడు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ డేరింగ్ & డ్యాషింగ్ అని నిరూపించుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన మెట్రో రైలు ప్రాజెక్ట్ గురించి తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో చేపట్టిన ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్ట్ ని రద్దు చేసి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ అవసరం లేదని, ఇది ప్రభుత్వానికి అనవసరపు ఖర్చు అని, పాతబస్తీని విమానాశ్రయం కి అనుసంధానం చెయ్యడం వల్ల ఓఆర్ఆర్ మెట్రో అవసరం పూర్తిగా తగ్గుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డట్టు చెప్పుకొస్తున్నారు.

revanth reddy metro rail

కేసీఆర్‌ను కలవరపెడుతున్న రేవంత్‌ చర్యలు

రేవంత్ రెడ్డి ఆలోచనని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది ఆహ్వానించగా, మరికొంత మాత్రం ఇది తెలివి తక్కువ చర్య అంటూ తిడుతున్నారు. గత ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో విస్తరణ గురించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. 69 వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ని విస్తరణ చెయ్యాలనే ఆలోచన చేపట్టాడు.

పటాన్ చెరువు ప్రాంతం నుండి నార్సింగి వరకు 22 కిలోమీటర్లు, అలాగే తుక్కుగూడ, బెంగళూరు మరియు పెద్ద అంబర్ పేట వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును విస్తరింపచేస్తామని అప్పట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మెట్రో కారిడారుని తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు , మేడ్చల్ నుంచి పటాన్ చెరు వరకు 29 కిలోమీటర్లు మరియు ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు మెట్రో ని విస్తరింపచెయ్యాలని అనుకున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో లైన్ వేసేందుకు శ్రీకారం చుడుతూ అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసాడు. అయితే ప్రస్తుతం ఈ లైన్ కి సంబంధించిన పనులు మొత్తం టెండర్ల దశలోనే ఉన్నాయి.

ఈ పనులన్నీ ఆపేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడట. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లబ్ది చేకూరడం కోసం చేపట్టిన కార్యక్రమాలు అని, వీటి వల్ల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడడం తప్ప మరొకటి లేదంటూ చెప్పుకొచ్చాడు రేవంత్ రెడ్డి.