‘నీ కేంటి బాస్ కూర్చొని సంపాదిస్తున్నావు’ ఈ మాట మనం చాలా సార్లు వినే ఉంటాం. నిజంగా కూర్చొని సంపాదిస్తే ఎలాంటి కష్టాలు ఉండవా..? లేదంటే ఆరోగ్యంగా ఉంటారా..? కానీ అలాంటి వారే ఎక్కువ వ్యాధులకు గురవుతూ సతమతం అవుతుంటారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కూర్చున్నా కూడా వ్యాధులు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదు
ఇప్పుడున్న జీవన విధానానికి గంటల తరబడి కూర్చుంటున్నారు. ఆరు బయట పనులు చేసే వారు కూడా సెల్ ఫోన్లు చేతి కచ్చిన తర్వాత ఎక్కువ సేపు చూస్తూ కూర్చుండిపోతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారిలో సాఫ్ట్ వేర్ జాబ్ హోల్డర్స్, డెస్క్ టాప్ తో పని చేసే వారు ఉంటారు. వీరు ఎక్కువ సేపు కూర్చొని పని చేయకుంటే కుదరదు.
ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చాలా వ్యాధులను ఆహ్వానిస్తుందని చెప్తున్నారు. నడవడం, అటూ తిరగడం కంటే కూర్చుంటేనే తక్కువ శక్తి ఖర్చవుతుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం కంటే ప్రతీ 30 నిమిషాలకు లేచి అటూ ఇటూ రెండు నిమిషాలు నడిస్తే మంచిదంటున్నారు.
ప్రధానంగా వ్యాపించే వ్యాధులు
ఊహించని వ్యాధులు కూడా శరీరంపై దాడి చేస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అందులో ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించినవి, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గంటల తరబడి కూర్చోవడంతో ముఖ్యంగా ఊబకాయంతో దీంతో పాటు బీపీ (రక్తపోటు), మెటబాలిక్ సిండ్రోం, షుగర్, చెడు కొలస్ర్టాల్ లాంటివి వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు హృదయ సంబంధ మైన వ్యాధులు కూడా దాడి చేస్తాయని చెప్తున్నారు.
ఎక్కువ మరణాలు వీరిలోనే
ప్రతి రోజు ఎనిమిది గంటల పాటు కూర్చొని పని చేసేవారి మరణాలు ఒబెసిటీ, ధూమపానం చేసేవారికంటే ఎక్కువని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. మిలియన్ కంటే ఎక్కువ మందిపై చేసిన పరిశోదనలో ఈ విషయం బయటపడింది. ప్రతి రోజు గంట నుంచి గంటన్నర వ్యాయామం చేసే వారు కూడా 8 గంటల పాటు కూర్చొని పని చేస్తే వారు చేసే వ్యాయామం ఫలితాలు పొందలేరని కూడా తేలింది. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారు తేలికపాటి వ్యాయామం చేస్తే ప్రయోజనాలు రెట్టింపుగా ఉంటాయని చెప్తున్నారు.
కదలిక అవసరం
ఒకే చోట గంటల తరబడి పని చేయడం మంచిది కాదు. ప్రతీ అరగంటకు ఒకసారి 2 నుంచి 3 నిమిషాల పాటు తేలికపాటి నడక మంచిది. ఇక పని చేస్తున్న సమయంలో అటూ ఇటూ కదిలాలి. శిలలా కూర్చోవద్దని దీనర్థం. ఇలా చేస్తే చాలా మంచిదని సూచిస్తున్నారు.
మీ కోసం కొన్ని చిట్కాలు
-కూర్చొని పని చేసే వారు ప్రతీ అరగంటలకు ఒక సారి లేచి నిలబడాలి.
-టీవీ, ఫోన్ చూస్తున్నప్పుడు కాళ్లను కాస్త పైకీ, కిందికీ ఆడించాలి.
-డెస్క్ టాప్ తో పని చేసే వారు నిపుణుల సూచనల మేరకు ఏర్పాటు చేసుకుంటే మంచింది.
-మరీ ముఖ్యంగా ఆఫీసుల్లో లీఫ్ట్ కు బదులు మెట్లు ఎక్కుతూ వెళ్లాలి.
ఇలా కొన్ని కొన్ని పాటిస్తే వ్యాధులను దూరం చేయడమే కాకుండా మరిన్ని అదనపు ప్రయోజనలు కూడా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.