20 ఎకరాలు.. 20 కోట్లతో ‘ధర్మస్థలి’ సెట్‌

0
411

గ్లోబలైజేషన్‌ ప్రభావంతో ప్రపంచ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్‌ హవాతో గ్రామీణ ప్రజలు సైతం ఇంటర్‌నెట్‌లో కావాల్సిన సినిమాను ఎంచక్కా ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో సినిమా నిర్మాణంలో అనేక మార్పు అనివార్యంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ స్థాయి సినిమాకు అవాటు పడిన మన ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్‌ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవలోనే భారీ బడ్జెట్‌తో చారిత్రాత్మక సినిమా నిర్మాణం జోరందుకుంది. బాహుబలి పుణ్యమా అని విజువల్‌ వండర్‌ కోసం దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు.

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా వార్తల్లో కెక్కింది. దేవాదాయ శాఖలో జరిగే అవినీతి ప్రధానాంశంగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వేసిన సెట్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అయింది. వివరాల్లోకి వెళితే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్యధిక భాగం ‘ధర్మస్థలి’ అనే ఊరు నేపథ్యంలో సాగుతుంది. ఇందు కోసం హైదరాబాద్‌ నగర్‌ శివారులో 20 ఎకరాలను అద్దెకు తీసుకున్నారట.

ఇందులో 20 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ‘ధర్మస్థలి’ ఊరి సెట్‌ను అత్యద్భుతంగా రూపొందించారు. భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ ఇలా 20 ఎకరాల్లో ఒక సెట్‌ను నిర్మించడం జరగలేదు. ఈ ఖ్యాతి మన తెలుగు సినిమాకు ‘ఆచార్య’ ద్వారా దక్కడం గర్వంగా చెప్పుకోవాలి. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మెగాస్టార్‌ రెండు డిఫరెంట్‌ పాత్రలు చేస్తున్నారు. వీటి కోసం ఆయన విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. రామ్‌చరణ్‌ ఇటీవల కరోనా బారిన పడడంతో సంక్రాంతి తర్వాత ఆయన ఈ సెట్‌లోకి అడుగుపెడతారు. ఈ చిత్ర నిర్మాణంలో రామ్‌చరణ్‌ కూడా ఓ భాగస్వామి అన్న విషయం తెలిసిందే.