సంక్రాంతి అంటే అటు తెలుగు చిత్ర పరిశ్రమకు, ఇటు తెలుగు ప్రేక్షకులకు చెప్పలేనంత ఇష్టం. అందుకే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మోత మోగిపోతూ ఉంటుంది. ఈ సందర్భంగా సినిమాల విడుదల, థియేటర్స్ డెకరేషన్,
బాంబుల మోతలు, డప్పులు చప్పుళ్లు.. అబ్బో ఆ హంగమానే వేరు. ఇలాంటి అకేషన్‌ను క్యాష్ చేసుకోవటానికి ఒప్పుడు అనేక సినిమాలు విడుదల అయ్యేవి.
బరిలోకి దిగిన వాటిలో ఓ రెండు, మూడు సినిమాలు హిట్‌గా నిలవగా, మిగిలినవి థియేటర్స్ ఖాళీ చేసి వెళ్లిపోయేవి. ఆ థియేటర్స్‌ను కూడా ఆక్యుపై చేసి, గల్లాలు నింపుకునేవి.
రాను రాను థియేటర్స్ మీద కొందరి గుత్తాధిపత్యం పెరిగిపోవడంతో సమస్య మొదలైంది. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్‌ను తమ చేతుల్లో పెట్టుకోవడం వల్ల వారికి సంబంధించిన సినిమాలకు మాత్రమే థియేటర్స్ దొరికే పరిస్థితి.
ఈ విషయంలో దాసరి నారాయణరావుగారు ఉన్న రోజుల్లో కొన్ని పంచాయితీలు కూడా నడిచాయి. కానీ ఎవరైనా పెద్ద సినిమాలను నిర్మిస్తూ..
విడుదల చేస్తూ ఉంటారో వారిదే పై చేయిగా నిలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించటానికి కొందరు పెద్ద నిర్మాతలు గిల్డ్‌గా ఏర్పడ్డారు.
అయితే అసలు సమస్య వీరే అయినప్పుడు వీరితో న్యాయం ఎలా జరుగుతుంది అంటూ చిన్న నిర్మాతలు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
తాజాగా ఈ సంక్రాంతికి కూడా గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. రవితేజ్ ఈగల్, విజయ్‌దేవరకొండ ఫ్యామిలీస్టార్ వంటి చిత్రాలు రావాల్సి ఉన్నా..
గిల్డ్ నిర్మాతల కోరిక మేరకు అవి పోస్ట్‌పోన్ అయ్యాయి. అయితే పైన పేర్కొన్న చిత్రాల్లో రెండు భారీ చిత్రాలు దిల్‌రాజు విడుదల చేస్తున్నవే కావడం విశేషం.
ఈ పోరులో హనుమాన్ చిత్రానికి థియేటర్స్ కేటాయించకుండా ఇబ్బంది పెట్టారు. ఇదే విషయమై దిల్‌రాజు స్పందిస్తూ…
పెద్ద సినిమాల మధ్య ఇలా ఒక చిన్న సినిమా రావడం కరెక్ట్ కాదు. అనవసరంగా ఇబ్బంది పడతారు అంటూ వ్యాఖ్యానించారు.
అయితే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన మెగాస్టార్ 2017 సంక్రాంతికి తన ఖైదీనెం.150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల విడుదల మధ్యలో దిల్‌రాజు తన శతమానంభవతిని తీసుకొచ్చారని,
అప్పుడు రెండు పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా ఎందుకు అని అంటే.. తన సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పారని, లక్కీగా ఆ సినిమా కూడా బాగా ఆడిరదని అన్నారు.
అంటే హనుమాన్ సినిమా థియేటర్స్‌లో దిల్‌రాజు తన సినిమాలకు ఒకలా.. బయట సినిమాలకు ఒకలా న్యాయం చేస్తున్నారని చిరు చెప్పకనే చెప్పారు. ఈ స్వీట్ వార్నింగ్ దిల్‌రాజుకు అర్ధమైందో? లేదో మరి.