టాలీవుడ్‌కు ఇప్పటికీ కేసీఆరే సీఎం

0
272
tollwood heros kcr

అదేంటో గానీ తెలుగు చిత్ర పరిశ్రమదో వింత వైఖరి. ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంది.. తెడ్డెం అంటే ఎడ్డెం అంటుంది. ఓ పట్టాన దాని వైఖరి ఏంటో ఎవరీ అర్ధం కాదు. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయదు.. తీరా చేసే సరికి చేతులు కాలిపోయి ఉంటాయి. ఏ విషయంలో అయినా ఇలాగే స్పందిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరి వర్గం వారిదే.. ఎవరి ప్రయోజనాలు వారివే.. తమ స్వప్రయోజనాల కోసం చేసే పని వల్ల ఇండస్ట్రీకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమోననే సోయ కొంచెం కూడా ఉండదు.

తాజాగా తెలంగాణలో ఏర్పడిన నూతన గవర్నమెంట్‌ విషయంలో కూడా టాలీవుడ్‌ పెద్దలు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు టాలీవుడ్‌కు సంబంధించిన పెద్దలు నూతన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు చెప్పి వస్తారు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రికి పరిశ్రమ తరపున సన్మానించడం ఆనవాయితీ. అయితే ఈసారి మాత్రం టాలీవుడ్‌ దానికి భిన్నంగా ప్రవర్తిస్తోంది.

యశోద హాస్పిటల్స్ లో చిరంజీవి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 10రోజులు కావొస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి అభినందించిన సినీ పెద్దలు లేరంటే నమ్మి తీరాల్సిందే. అదే చంద్రబాబు, కేసీఆర్‌ల విషయంలో గుడ్డలు చించుకుని మరీ ఎగబడతారు.. అభినందనల్లో ముంచెత్తుతారు. ముఖ్యమంత్రిని కలవలేదు సరే.. కనీసం సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం ఒక్కరంటే ఒక్కరు కూడా కలవలేదు. కేవలం దిల్‌రాజు మాత్రం ఫోన్‌లో అభినందనలు తెలిపారట. ఈ విషయం మంత్రిగారే చెప్పారు.

అంతే కాదండోయ్‌… చిత్ర పరిశ్రమకు సంబంధిన లెక్కలు కూడా చూడాలి అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో తమ వైఖరి ఏంటో ఆయన చెప్పకనే చెప్పారు. అయినా అంటే అన్నాం అంటారు గానీ.. నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అభినందించడానికి సమయం లేదు గానీ.. కాలుజారి పడిన కేసీఆర్‌ను పరామర్శించడానికి మాత్రం చిరంజీవి, నాగార్జున, ఆయన సోదరుడు వెంకట్‌ అక్కినేని తదితరులు యశోదా ఆసుపత్రిలో వాలిపోయారు.

దీంతో ఇప్పటికే తమను టాలీవుడ్‌ కేర్‌ చేయడం లేదు అన్న భావనలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు పుండు మీద కారం చల్లినట్లు అయింది. అంతేకాక టాలీవుడ్‌కు సంబంధించినంత వరకూ ఇప్పటికీ కేసీఆరే సీఎం అన్నట్లు సంకేతాలు వెళ్లాయి. చూడాలి రాబోయే రోజుల్లో టిక్కెట్ల రేట్లు పెంచాలి.. స్పెషల్‌ షోలకు పర్మిషన్‌ ఇవ్వాలి.. అంటూ టాలీవుడ్‌ ప్రభుత్వం దగ్గరకు క్యూకట్టకుండా ఉంటుందా.. పైగా కొద్ది రోజుల్లోనే అతి పెద్ద సంచలనం ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ కూడా విడుదల కానుంది. వెయిట్‌ అండ్‌ సీ..