ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణకు మంగళం?

0
673
ys jagan

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ముఖ్యంగా అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత చర్చనీయాంశం మంత్రి వర్గ విస్తరణ. సాధారణ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఏ ముఖ్యమంత్రి అయినా తన క్యాబినెట్‌లో సమర్ధులుగా భావించిన కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం సహజం. ఇలా మంత్రి పదవులు పొందిన వారు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాలవల్ల మంత్రి మండలిలో కొందరిని తప్పించటం.. మరికొందరికి కొత్తగా అవకాశం ఇవ్వటం చేస్తుంటారు. అయితే మెజార్టీ మంత్రులు 5 సంవత్సరాలూ పదవిలోనే ఉంటారు.

సాధారణ ఎన్నికల్లో 151 సీట్ల భారీ మెజార్టీతో గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. భారీ మెజార్టీ రావడంతో అనేక మందికి మంత్రి మండలిలో చోటు కల్పించడం కష్టతరం కావడంతో, తొలి రెండున్నర సంవత్సరాలు కొందరికి అవకాశం ఇస్తాను, మిగిలిన రెండున్నర సంవత్సరాలు మరికొందరికి అవకాశం ఇస్తాను అని ఆయన ప్రకటించారు. చెప్పినట్లుగానే కులాలు, మతాలు, ప్రాంతాలు ఈక్వేషన్స్‌ చూసుకుని తొలి విడతలో కొందరికి అవకాశం కల్పించారు. వీరి పదవీకాలం ఈ నెలతో ముగుస్తోంది.

ప్రస్తుతానికి మంగళం పాడినట్లే

వచ్చేది ఎన్నికల కాలం కాబట్టి రెండవ విడతలో ఛాన్స్‌ కోసం చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. లెక్క ప్రకారం అయితే ఈ పాటికే కొత్త క్యాబినెట్‌ కూర్పు పూర్తి అయి ఉండాలి. కానీ ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన ఊసు కూడా లేకుండా పోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండవ విడత క్యాబినెట్‌ కూర్పుకు జగన్‌ ప్రస్తుతానికి మంగళం పాడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయి దాటి పోతుండటంతో అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టేసారు. కేవలం సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టిన కారణంగా అటు అభివృద్ధిని కోరుకునే వర్గంలో ప్రభుత్వం వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది.

ముఖ్యమంత్రిపై అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి

సంక్షేమ ఫలాల అందుకుంటున్న వర్గాలు కూడా విపరీతమైన ధరల పెరుగుదలతో ప్రభుత్వంపై అంతర్గతంగా గుర్రగా ఉన్నారు. ఇలాంటి వంటి విషయాలు సీఎంను ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామంటూ చేసిన హడావుడికి.. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తుండడంతో ఎమ్మెల్యేలు సైతం.. 30 ఏళ్ల అధికారం సంగతి దేవుడెరుగు.. ఈ టర్మ్‌లోనే అమాత్య పదవి అలంకరించాలని డిసైడ్‌ అయిపోయారు. దీంతో ముఖ్యమంత్రిపై అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుతోంది.

క్యాబినెట్‌ విస్తరణ జోలికి పోకుండా ఉండటమే మంచిది

దీనికి తోడు స్వంత పార్టీ ప్రజాప్రతిధులు సైతం ధిక్కారస్వరం వినిపిస్తూ అధిష్ఠానాన్ని లెక్క చేయకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో మంత్రి వర్గ విస్తరణ అంటూ అనవసరంగా కొరివితో తల గోక్కోవటం ఎందుకన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తోస్తోంది. అందుకే మరో సంవత్సరం పాటు క్యాబినెట్‌ విస్తరణ జోలికి పోకుండా ఉండటమే మంచిదని, ఈ లోపు పరిస్థితులు చక్కబడితే అప్పుడు చూడువచ్చు అన్నది ముఖ్యమంత్రి ఆలోచన అయి ఉండవచ్చు.