నాగ్‌ శతదినోత్సవ షీల్డ్‌ మీద 99 రోజులే ఎందుకు వేశారు

0
625

తాము నిర్మించిన సినిమా ఘన విజయం సాధించాలని, శతదినోత్సవ సంబరాలు జరుపుకోవాని ప్రతి సినిమా యూనిట్‌ సభ్యులు కోరుకుంటారు. 100 రోజు షీల్డ్‌ తమ తమ ఆఫీసుల్లో ఇళ్లల్లో పెట్టుకుని.. రోజూ దాన్ని చూసుకుంటూ సంబరపడి పోవడంలో ఉండే కిక్కే వేరు. ఇలాంటి సూపర్‌ కిక్కు అందించాల్సిన ఓ సినిమా శతదినోత్సవం దాటి పరుగు తీసినా, షీల్డ్‌లో మాత్రం 99 రోజుగానే వేసుకుంది. ఈ ఆసక్తికరమైన విషయం వెనుక ఉన్న అసలు కథ చూద్దాం.

నటసమ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా ‘విక్రమ్‌’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. హిందీలో జాకీష్రాఫ్‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌ డూపర్‌ మ్యూజికల్‌ హిట్‌ చిత్రం ‘హీరో’. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై వి. మధుసూదనరావు దర్శకత్వంలో ‘విక్రమ్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. శోభన హీరోయిన్‌, సత్యనారాయణ, చంద్రమోహన్‌ ముఖ్యపాత్రధాదారులు. 1986 మే 23న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌ స్వంతం చేసుకుంది.

చక్రవర్తి సంగీత దర్శకత్వ మహిమతో తెలుగులో కూడా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. పలు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి శతదినోత్సవ షీల్డ్‌లో మాత్రం 99 రోజు అని వేయించారు. దీనికి కారణం ఈ సినిమా 99వ రోజున నాగార్జున పుట్టినరోజు కూడా. అందుకే నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ 99వ తేదీతో షీల్డ్‌ు వేయించింది. అయితే కోస్తాలో తుఫాను కారణంగా ప్రజా జీవితం కల్లోలం కావడం నాగేశ్వరరావు గారిని కలిచి వేసింది. దీంతో ఆ సినిమా వేడులను నిర్వహించడానికి కేటాయించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలా ఆనవాయితీకి భిన్నంగా వంద రోజు దాటి పరుగు తీసిన చిత్రమే అయినా 99 రోజు షీల్డ్‌ అందుకోవాల్సివచ్చింది.