కేసీఆర్‌ అలా ఫిక్స్‌ అయిపోయారా?

0
254
cm kcr telangana

అధికారంలో ఉన్నంత వరకూ చిన్న.. పెద్దా.. సారు.. గీరూ.. ఒక్కసారి గాని దానికి దూరం అయ్యామా.. ఇక అంతు సంగతులు. అందుకే గౌరవంగా పక్కకు తప్పుకోవడమే బెటర్‌ అన్న ఆలోచన చేస్తున్నారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని 3 నెలల ముందు వరకూ కూడా కలలో కూడా ఊహించలేదు కేసీఆర్‌. అందుకే చిన్న చిన్న నిర్ణయాలతో కొన్ని వర్గాలకు చేరువయ్యే అవకాశం ఉన్నా అహంకారానికి పోయారనేది కొంత వరకూ వాస్తవమే.

అయితే పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతున్నాయని గ్రహించినప్పటికీ కాంగ్రెస్‌ సంస్కృతి మీద అపారమైన నమ్మకమున్న ఆయన వాళ్లల్లో వాళ్లే తన్నుకు ఛస్తారులే అనుకున్నారు. దీనికి తోడు నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ ఇవ్వదు. ఒకవేళ ఇద్దామనుకున్నా తన కనుసన్నల్లో మెలిగే కాంగ్రెస్‌ నాయకుల ద్వారా రేవంత్‌పై వ్యతిరేకత వెళ్లగక్కి కాంగ్రెస్‌లో గ్రూపులు సృష్టించాలనుకున్నారట.

cm kcr telangana

బీఆర్‌ఎస్‌ నెత్తిన పడిన మేడిగడ్డ పిడుగు?

తద్వారా ఒక గ్రూప్‌ను తన దరికి చేర్చుకుని మళ్లీ పీఠంపై కూర్చోవాలన్నది ఆయన ఆలోచన కూడా అయి ఉండవచ్చు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కాంగ్రెస్‌లో కూడా చాలా మర్పులు వచ్చాయి. రేవంత్‌ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగి పార్టీకి ఉత్తేజం తేవడమే కాకుండా, సీనియర్ల ఇంటికి స్వయంగా వెళ్లి వారిని మచ్చిక చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ఐక్యతారాగం మొదలైంది.

కేసీఆర్‌ ఆశపెట్టుకున్న వ్యక్తులు కూడా రేవంత్‌కే జై కొట్టడంతో కథ బెడిసికొట్టింది. ఈ కారణంగా కేసీఆర్‌ ప్లాన్‌ తల్లక్రిందులు అయి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇక్కడే కేసీఆర్‌కు పెద్ద చిక్కొచ్చిపడిరది. సీనియర్‌ పొలిటీషియన్‌గా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, 9 సం॥లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, జాతీయ రాజకీయాలను సైతం శాసించబోయిన వ్యక్తిగా ఉన్న తాను ఇప్పుడు అసెంబ్లీకి హాజరయి, తాను రాజకీయ భిక్ష పెట్టిన రేవంత్‌రెడ్డి ముందు చేతులు కట్టుకుని నిలబడటం ఒకటి.

అలానే సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్లు అందరూ ఇప్పుడు తన గతపాలనపై విరుచుకుపడే అవకాశం ఉండటం ఇలాంటి కారణాల వల్ల తాను అసలు సభకు వెళ్లకుండా ఉంటే ఆ మిగిలిన గౌరవం అన్నా దక్కుతుందనే ఆలోచనలో కేసీఆర్‌ ఉండే అవకాశం ఉంది. ఎలాగూ కాలుజారి పడిన కారణం ఉంది కాబట్టి, అసెంబ్లీ తొలి సెషన్‌ను తప్పించుకున్నారు. ఇక కేటీఆర్‌ను బీఆర్‌ఎస్‌ శాసనసభా నాయకుడిగా చేసేస్తే తన బాధ్యత తీరిపోతుంది అని ఫిక్సయ్యారా అనే అనుమానం కలగక మానదు.