వైసీపీ కవరపెడుతున్న ఆ ఇద్దరు

    0
    356

    2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్‌ సీట్లలో గెలవడం ద్వారా వైసీపీ ఢంకా బజాయించింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకూ ఎక్కడా ఉప ఎన్నిక జరగలేదు. అయితే ఇటీవల తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. అధికారం చేపట్టింది మొదలు ప్రజా సంక్షేమంలో దూసుకుపోతున్నామని, కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక మాకు నల్లేరు మీద నడకేనని అధికారపార్టీ భావిస్తోంది. పాలనలో అనుభవలేమితో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిరదని, అధికార పార్టీ నాయకులు అందినకాడికి దోచుకు తినడం వల ప్రజల్లో వ్యతిరేకత బాగా వచ్చిందని, ఇది తమ గెలుపుకు బాగా పనికొస్తుందని విపక్షా లు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

    అయితే తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు. ఈ లోక్‌సభ పరిధిలో 5 రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. ఆది నుంచీ కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ ఓటు బ్యాంకు, రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి దగ్గరైంది. ఈ కారణంగా 2019 ఎన్నికల్లో దివంగత బల్లి దుర్గాప్రసాద్‌ 2.28 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు విడి విడిగా పోటీ చేశాయి.

    కానీ రాబోయే ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గం వారు ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తమ సామాజికవర్గం నుండి ఉమ్మడి అభ్యర్ధిని నిబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తోడు ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సైతం మహాజన సోషలిస్ట్‌పార్టీ అభ్యర్ధి ఎమ్మార్పీఎస్‌ మద్దతుతో బరిలోకి దిగుతారని ప్రకటించారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఎస్సీ నియోజకవర్గాల్లో మాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, మాదిగలకు అన్యాయం చేస్తున్నారనే వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు. అందుకే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ తెరమీదకు తీసుకురానున్నారట.

    వర్గీకరణ అంశం ప్రభావం ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. అటు ఎస్సీ సంఘాల నుంచి ఉమ్మడి అభ్యర్ధి, ఇటు ఎమ్మార్పీఎస్‌ మద్దతుతో మరో ఎస్సీ అభ్యర్ధి రంగంలోకి దిగుతుండడంతో వారి గెలుపు పై పెద్దగా నమ్మకం లేనప్పటికీ, వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అంశమే ఇప్పుడు వైసీపీ పెద్దలను కలవర పెడుతోందట.