ఫ్లెక్సీలతో ప్రభుత్వ పరువును నిట్ట నిలువునా తీసిన రైతులు

0
515

రైతే రాజంటారు.. రైతు లేనిదే మనిషి మనుగడే లేదంటారు.. కానీ ఆ రైతులకు మాత్రం అన్యాయం చేయడంలో రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. అయితో ఒక్కో పార్టీది ఒక్కో తీరు. అన్నం పెట్టే రైతుకు ఆగ్రహం వస్తే మాత్రం తట్టుకోవడం కష్టం. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలోని ఉండవల్లి రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం చెందారు. ప్రభుత్వ పరువును నిట్టనిలువునా తీస్తూ వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. కృష్ణానదికి ఆనుకుని ఉన్న కరకట్ట ఒకప్పుడు ఓ సాధారణ రోడ్డు.

అయితే రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో ఈ మార్గానికి ప్రాధాన్యత ఏర్పడిరది. అంతే కాదు. సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే కరకట్టకు ఆనుకుని ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకోవడంతో ఇది విఐపి మార్గంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ రహదారిపై రాకపోకలు బాగా పెరిగాయి. ఈ కారణంగా ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ కరకట్టను విస్తరించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు అధికారులు. ఈ రోడ్డు విస్తరణకు అవసరమైన సర్వేను నిర్వహించారు.

ఈ సందర్భంగా విస్తరణలో తమ పొలాలు కోల్పోతున్న రైతులు అధికారులకు ఎదురు తిరిగారు. తమకు నష్టపరిహారం చెల్లించనిదే పొలాల్లో కొలతలు తీయడానికి వీలు లేదు అని వారిని వెళ్లగొట్టారు. తాజాగా విస్తరణ పనులు మొదలు పెట్టడానికి అధికారులు సిద్ధం అయ్యారు. విషయం తెలుసుకున్న రైతులు సంచలనాత్మక రీతిలో తమ పొలాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటే చేశారు. అందులో ‘‘ఏపీ సీఆర్‌డీయే వారికి విజ్ఞప్తి.. మా అనుమతి లేనిదే మా భూమిలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు చేయడానికి వీలు లేదు. ఇట్లు ఉండవల్లి రైతులు’’ అంటూ ఫ్లెక్సీల్లో రాయడం సంచలనం సృష్టిస్తోంది.

భూమి కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఎటువంటి నిర్మాణ పనులు చేయకూడదు అని చట్టం చెపుతోంది. దీని ప్రకారం రైతులకు పరిహారం అవ్వకుండా రోడ్డు విస్తరణ చేయకూడదు. కానీ ప్రభుత్వం ఇందుకు సిద్ధం కావడంతో రైతులు తొలి విడతగా ఇలా ఫ్లెక్సీలు పెట్టి నిరసన తెలియజేశారు. తదుపరి వీరు హైకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఇదే రోడ్డు పై నుంచి నిత్యం ప్రయాణించే న్యాయమూర్తుల దృష్టి ఈ ఫెక్సీలపై పడి ఉంటుంది కనుక తప్పకుండా ఈ కేసు విషయంలో వారు లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంటుంది. అంటే మరో మొట్టికాయ తినటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం అన్నమాట.