కెమెరా, కారు చాలు.. అందర్నీ పంపేయండి!

0
274
etv satyanarana

ఒక కథను అనుకోవడం వేరు. దాన్ని తెరకెక్కించడం వేరు. అదీ అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న టైమ్‌లో. ప్రాక్టికల్‌గా చూస్తే ఇది కొంత వరకూ కష్టమే.

కానీ చివరి నిముషం వరకూ, చివరి రూపాయి వరకూ పోరాటం చేస్తూనే ఉంటారు యూనిట్‌ సభ్యులు. అలా నిర్మాతకు ఒక్క రూపాయి మిగిల్చినా చాలు అనుకునే నిర్మాతల దర్శకులు కొంత మంది ఉంటారు. అలాంటి దర్శకుల్లో ఈవీవీ సత్యనారాయణ ఒకరు.

etv satyanarana

ఆ ఒక్క ట్యూన్‌ రెహ్మాన్‌ లైఫ్‌ టర్న్‌ చేసింది..

1988లో వచ్చిన ‘కళ్లు’ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఎం.వి. రఘు. గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నవల ఆధారంగా దీన్ని రూపొందించారు.

నాలుగు నంది అవార్డులతో పాటు, ఇండియన్‌ పనోరమలో ప్రదర్శించబడిన చిత్రం. ఫిలింఫేర్‌ అవార్డుతో కలిపి దాదాపు 30 అవార్డులను దక్కించుకున్నది. అప్పటికే దర్శకుడిగా ట్రయల్స్‌ ఉన్నారు ఈవీవీ.

రామానాయుడు గారు మాట కూడా ఇచ్చారు. నాయుడిగారి సినిమాకు కొంత సమయం ఉండటంతో ఎం.వి. రఘు రిక్వెస్ట్‌ చేయడంతో ఈవీవీ సత్యనారాయణ కో`డైరెక్టర్‌గా చేరారు.

లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం షెడ్యూల్‌ ఒకటి వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అనుకోకుండా మధ్యలో వాయుగుండం పడటంతో 4 రోజుల పాటు షూటింగ్‌కు అంతరాయం కలిగింది. అప్పటికే ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ రిటర్న్‌ టిక్కెట్స్‌ కూడా వేసేశారు. ఒక పాట బ్యాలెన్స్‌ ఉండిపోయింది.

ఏం చేయాలో అర్ధం కావడంలేదు దర్శకుడు ఎం.వి. రఘుకు. పైగా ఆ పాట ఉత్తరాంధ్ర జీవన చిత్రానికి అద్దం పట్టేలా తీయాలనుకున్నాడు. ‘‘తెల్లారింది లెగండోయ్‌ కొక్కురకో..

మంచాలింక దిగండోయ్‌ కొక్కురకో..’’ అంటూ సిరివెన్నెల గారు అద్భుతమైన గీతాన్ని రచించడమే కాకుండా స్వయంగా ఆయనే ఆలపించారు కూడా.

ఈవీవీ గారికి ఒక ఐడియా తట్టింది. వెంటనే దర్శకుడు ఎం.వి. రఘుతో ‘‘సార్‌.. ఒక కెమెరా, కారు చాలు.. అందర్నీ యధావిధిగా పంపేయండి’’ అన్నారు. రఘుకు అర్ధం కాలేదు. నేను చెప్పినట్లు చేయండి మన పని అయిపోతుంది కంగారు పడకండి అన్నారు ఈవీవీ.

రఘకు ఈవీవీ మీద చాలా నమ్మకం. ఆ నమ్మకంతోనే అందర్నీ పంపేశారు. అపుడు ఈవీవీ, రఘులు కలిసి కారులో కెమెరా పెట్టుకుని రెండు రోజుల పాటు వైజాగ్‌, పరిసర ప్రాంతాల్లో రోడ్లమీద షాట్స్‌కు తీసుకుంటూ పోయారు. ఆ తరువాత మద్రాసు వచ్చి, వాటికి కొన్ని లైబ్రరీ షాట్స్‌ కలిపి సాంగ్‌ను పూర్తి చేశారు.

అలా తయారైన ఆ ‘‘తెల్లారింది లెగండోయ్‌…’’ పాట నిజంగా ‘కళ్లు’కు అద్భుతమైన వెలుగునిచ్చింది. ఇప్పటికీ.. ఎప్పటికీ ‘కళ్లు’ చిత్రం పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ పాటే కావడం విశేషం.