ధరణిలో మాజీ ఎమ్మెల్యే 2 ఎకరాలు మాయం

0
148
telangana dharani

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ రియల్‌ ఎస్టేట్‌ మిత్రుడికి ఏదో పనిమీద ఫోన్‌ చేశాను. అసలు విషయం మాట్లాడిన తర్వాత కొసరుగా రాజకీయాలవైపు వచ్చి.. ఈసారి బీఆర్‌ఎస్‌ గెలుస్తుందా అన్నాడు. నేను గెలవదు అన్నాను. మరి నీ ఐడియా చెప్పు అన్నాను.. ఖచ్చితంగా గెలవదు.. అన్నాడు.

నేనంటే జర్నలిస్ట్‌ను కాబట్టి వివిధ రూపాల్లో వచ్చిన సమాచారాన్ని బట్టి ఒక అంచనాకు వస్తాను. కానీ అతను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న వ్యక్తి. అంత ఖచ్చితమైన అంచనాకు ఎలా వచ్చాడో అర్ధంకాక.. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అన్నాను.

దానికి అతను బీఆర్‌ఎస్‌ ఓటమికి సగం కారణం ధరణి పథకం అవుతుంది చూడు అన్నాడు. కొంచెం అర్ధమయ్యేటట్లు చెప్పమంటే.. ఇటీవల తాను 3 డీల్స్‌ ఫైనల్‌ దాకా తీసుకెళ్లానని, అంతా అయిపోంది అనుకుంటున్న తరుణంలో ఈసీ సర్టిఫికెట్‌ కోసం అప్లై చేస్తే సదరు భూమి అమ్మకందారుపైన లేకపోవడమో.. ఉన్నా ఇతని దగ్గరున్న డాక్యుమెంట్‌లలోని విస్తీర్ణం కాకుండా ధరణిలో వేరే విస్తీర్ణం ఉండటమో జరిగిందని, తన సహచర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పాడు.

తాజాగా సీపీఐ (ఎం.ఎల్‌) మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తనకు చెందిన 2 ఎకరాల భూమిని ధరణిలో మాయం చేశారని ప్రజావాణిలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో అప్పుడు నా స్నేహితుడు చెప్పింది ఎంత అక్షర సత్యమో ఇప్పుడు అర్ధమైంది.

విషయంలోకి వెళితే ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ (ఎం.ఎల్‌) పార్టీకి చెందిన గుమ్మడి నర్సయ్య స్వతంత్ర అభ్యర్ధిగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికీ చాలా సాదాసీదా జీవనం సాగిస్తుంటారు. శుక్రవారం హైదరాబాద్‌ ప్రజావేదికలో నిర్వహించే ప్రజావాణికి వచ్చారు.

telangana dharani

ఎమ్మెల్యేలను తీసుకెళ్లి తేల్చడానికి అదేమైన టూరిస్ట్‌ స్పాటా

తనకు చెందిన 2 ఎకరాల భూమిని ధరణి పేరుతో మాయం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి భూమినే ధరణి పేరుతో కాజేశారంటే ఇక సామాన్యుల భూముల సంగతి చెప్పనవసరం లేదు.

ప్రజావాణిలో వస్తున్న వినతుల్లో దాదాపు 70శాతం ఫిర్యాదులు భూముల మాయం గురించే కావడం విశేషం. ధరణిలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎన్నికలకు ముందే రేవంత్‌రెడ్డి అనేకమార్లు మీడియా సమావేశాల్లో చెప్పారు.

తాము వస్తే ధరణి పేరుతో జరిగిన అన్యాయాలన్నీ వెలికితీస్తామని కూడా అన్నారు. ప్రస్తుతం ఈ విషయం మీదే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ విషయం ఎలాంటి ప్రకంపనాలు సృష్టించనుందో చూడాలి.